ఇది రైతులను ఇబ్బంది పెట్టే ప్రభుత్వం

ఇది రైతులను ఇబ్బంది పెట్టే ప్రభుత్వం
రైతులు కన్నీరు కారుస్తుంటే పలుకరించే నాథుడు లేడు
మాజీ మంత్రి జోగి రమేష్ విమర్శలు
కొటికలపూడిలో దెబ్బతిన్న మొక్కజొన్న, మునగ పంటలు పరిశీలన
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ఇది రైతులను ఇబ్బంది పెట్టే ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం.. ఇది మనసున్న ప్రభుత్వం కాదు..’ అని మాజీ మంత్రి, వైసీపీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ విమర్శించారు. మండల పరిధిలోని కొటికలపూడిలో ఈదురు గాలులు, అకాల వర్షానికి నేలకొరిగిన మొక్కజొన్న, మునగ పంటలను గురువారం సాయంత్రం ఆయన పరిశీలించారు. రైతులను పరామర్శించి నష్టపోయిన పంట వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జోగి మాట్లాడుతూ అకాల వర్షానికి మొక్కజొన్న, మునగ పంటను రైతులు నష్టపోతే ఈ ప్రభుత్వం, అధికారులు ఏమయ్యారని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం రైతులను పట్టించుకునే పరిస్థితిలో లేదని విమర్శించారు. నాడు జగన్మోహన్ రెడ్డి రైతులను గుండెల్లో, మనసులో పెట్టుకుని చూశారని, నేడు రైతులు కన్నీరు కారుస్తుంటే కనీసం పలుకరించే నాధుడు లేడని, ఇది ఒక ప్రభుత్వమేనా? ఇది ఒక పరిపాలనేనా? అని ప్రశ్నించారు.
ఒకవైపు క్రాప్ ఇన్సూరెన్స్, ఇన్ ఫుట్ సబ్సిడీ లేక, మరోవైపు యూరియా లభించక రైతులు ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ఎంజాయ్ చేస్తున్నారని దుయ్యబట్టారు. రైతన్నలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైసీపీ మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
