Water Dispute | తుంగభద్ర జలాలపై రేవంత్‌కు హరీశ్‌రావు లేఖ
Water Dispute | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: తుంగభద్ర జలాల అంశంపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టి.హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ప్రయోజనాలు, జల హక్కులను తాకట్టు పెట్టే చర్యలకు దూరంగా ఉండాలని, తెలంగాణ వాటాకు భంగం కలిగించే కుట్రలను తక్షణమే అడ్డుకోవాలని లేఖలో కోరారు.
తుంగభద్ర నదిపై కర్ణాటక ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆర్డీఎస్, తుమ్మిళ్ల, భీమా ప్రాజెక్టుల ప్రయోజనాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. కర్ణాటక చేపడుతున్న ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణకు రావాల్సిన నీటి వాటా గణనీయంగా తగ్గిపోతుందని హెచ్చరించారు.
తెలంగాణ జల హక్కులను రాజకీయ బేరసారాల అంశంగా మార్చారా అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని హరీశ్‌రావు ప్రశ్నించారు. కర్ణాటక ప్రభుత్వం తుంగభద్రపై ప్రాజెక్టులను వేగంగా ముందుకు తీసుకెళ్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.
ఈ అంశంపై వెంటనే జోక్యం చేసుకుని Central Water Commission, Krishna River Management Board, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు అధికారికంగా అభ్యంతరాలు తెలియజేయాలని ఆయన సూచించారు. అవసరమైతే కర్ణాటక ప్రాజెక్టులపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కూడా కోరారు.
పాలమూరు ప్రాంత జల హక్కుల కోసం మరోసారి ఉద్యమాలు చేపట్టాల్సిన పరిస్థితి రాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు హితవు పలికారు. రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా తీసుకునే ప్రతి నిర్ణయాన్ని బీఆర్‌ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు.
