Farmer loan waiver 2026 I బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నాయి: భట్టి
Farmer loan waiver 2026 I బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నాయి: భట్టి
Farmer loan waiver 2026 I ఉమ్మడి వరంగల్, ఆంధ్రప్రభ బ్యూరో:
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కుమ్మక్కై రైతులను, ప్రజలను వంచిస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని పల్లగుట్ట గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు.
రూ.8 లక్షల కోట్ల అప్పుల భారం మోపారు
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో తెలంగాణను రూ.8 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టిందని భట్టి ఆరోపించారు. ఆ అప్పుల కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఏడాది రూ.76 వేల కోట్లను అసలు, వడ్డీల రూపంలో చెల్లించాల్సి వస్తోందన్నారు. ఆ భారం లేకపోయి ఉంటే ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు మరింత నిధులు కేటాయించే అవకాశం ఉండేదని పేర్కొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో పేదలకు ఇళ్లు, సన్నబియ్యం వంటి పథకాలు అందలేదన్నారు.
డిస్కంలను అప్పులపాలు చేసింది బీఆర్ఎస్నే
ఉచిత విద్యుత్ పేరుతో ప్రచారం చేసుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం డిస్కంలకు బకాయిలు చెల్లించకుండా వాటిని అప్పులపాలు చేసిందని భట్టి విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉచిత విద్యుత్‌కు సంబంధించిన రూ.14 వేల కోట్లు, గృహజ్యోతి పథకానికి సంబంధించిన రూ.5 వేల కోట్లను కలిపి మొత్తం రూ.19 వేల కోట్లను డిస్కంలకు చెల్లిస్తూ నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తోందన్నారు.
హరీశ్ రావు అబద్ధపు ప్రచారం చేస్తున్నారు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంటే, మాజీ మంత్రి హరీశ్ రావు రోజుకో అబద్ధాన్ని సృష్టిస్తూ వార్తల్లో నిలవాలని ప్రయత్నిస్తున్నారని భట్టి విమర్శించారు. అధికారం కోల్పోయిన అసహనంతోనే ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
ధాన్యం కొనుగోలు చేయని కేంద్రం
మద్దతు ధర ప్రకటించే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని ఎఫ్‌సీఐ ద్వారా ఎందుకు సేకరించడం లేదని భట్టి ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేంద్ర సంస్థల ద్వారా ధాన్యం కొనుగోలు జరిగేదని గుర్తు చేశారు. కేంద్రం కొనుగోలు చేసినా, చేయకపోయినా తెలంగాణ ప్రభుత్వం రైతుల వద్ద చివరి ధాన్యపు గింజ వరకు కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు.
దేశంలో చాలా రాష్ట్రాల్లో మొక్కజొన్న కొనుగోళ్లు జరగడం లేదని, తెలంగాణలో మాత్రం ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని తెలిపారు. రబీ సీజన్లో రికార్డు స్థాయిలో 72.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం తమదేనని చెప్పారు.
రైతు రుణమాఫీ చరిత్ర సృష్టించాం
ఒకే విడతలో రూ.22 వేల కోట్ల రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని భట్టి పేర్కొన్నారు. విమర్శలు చేసే బదులు కేంద్ర ప్రభుత్వం ద్వారా ధాన్యం కొనుగోలు చేయించేలా ప్రతిపక్షాలు ఒత్తిడి తీసుకురావాలని సూచించారు.
ఇందిరమ్మ ఇళ్లకు రూ.22,500 కోట్లు
గత ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో పేదలను మోసం చేసిందని విమర్శించిన భట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం తొలి విడతలో రూ.22,500 కోట్ల వ్యయంతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందన్నారు. ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది ప్రతి నియోజకవర్గానికి అదనంగా 2,000 ఇళ్లను కేటాయిస్తామని వెల్లడించారు.
కోటి 15 లక్షల కుటుంబాలకు ఉచిత బీమా
రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలకు త్వరలో రూ.5 లక్షల ఉచిత బీమా సదుపాయం కల్పించనున్నట్లు భట్టి ప్రకటించారు. నిరుపేద కుటుంబాలకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
మహిళా సంఘాలకు భారీ రుణాలు
మహిళా సంఘాలకు రెండున్నరేళ్లలో రూ.67 వేల కోట్ల బ్యాంకు లింకేజ్ రుణాలు అందించామని, ఐదేళ్లలో ఈ మొత్తాన్ని రూ.1.25 లక్షల కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. మహిళా సంఘాలు బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీ ద్వారా నడిపే కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు.
స్టేషన్ ఘన్‌పూర్‌కు రూ.60 కోట్ల విద్యుత్ పనులు
స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా రూ.60 కోట్లకు పైగా వ్యయంతో విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు భట్టి తెలిపారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి కోరిన పలు అభివృద్ధి పనులపై సానుకూలంగా స్పందించారు.
రఘునాథపల్లి 232 కేవీ సబ్‌స్టేషన్ అప్‌గ్రేడేషన్ ప్రతిపాదనను పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామాల్లో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ లైన్ల మార్పిడి కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టాన్ని ప్రభుత్వం సమర్థంగా అమలు చేస్తోందని, నియోజకవర్గానికి కూడా సబ్‌ప్లాన్ నిధులు పెద్ద ఎత్తున అందుతాయని పేర్కొన్నారు.

