నాలుగు గంటల వ్యవధిలో రెండు సుఖ ప్రసవాలు

నేరేడుచర్ల, ఆంధ్రప్రభ : నాలుగు గంటల వ్యవధిలో ఇద్దరు గర్భిణులకు సురక్షితంగా సాధారణ ప్రసవాలు నిర్వహించిన ఘటన శనివారం నేరేడుచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చోటుచేసుకుంది.

దిర్శించర్ల గ్రామానికి చెందిన శ్రీకన్య రెండో కాన్పు కోసం శుక్రవారం సాయంత్రం పురిటి నొప్పులతో ఆసుపత్రికి చేరుకున్నారు. వైద్య సిబ్బంది వెంటనే అవసరమైన పరీక్షలు నిర్వహించి, సాయంత్రం 6 గంటలకు సురక్షితంగా సాధారణ ప్రసవం నిర్వహించారు. ఆమెకు 3.5 కిలోల బరువున్న పండంటి మగబిడ్డ జన్మించాడు.

అదే రోజు పాలకవీడు మండలం అలింగాపురం గ్రామానికి చెందిన అంజలి మూడో కాన్పు కోసం ఆసుపత్రికి చేరుకున్నారు. ఆమెకు కూడా వైద్య బృందం అవసరమైన పరీక్షలు నిర్వహించి, రాత్రి 9.45 గంటలకు సురక్షితంగా సాధారణ ప్రసవం చేశారు. ఆమె కూడా 3.5 కిలోల బరువున్న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

అంజలి దంపతులకు మొదటి రెండు కాన్పుల్లో ఆడపిల్లలు జన్మించగా, మూడో కాన్పులో మగబిడ్డ జన్మించడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఇరు కుటుంబాలు వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ పున్న నాగిని మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారి ప్రోత్సాహంతో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి సేవలకు అవసరమైన ఆధునిక పరికరాలు, సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. దీంతో గర్భిణులకు సురక్షితంగా సాధారణ ప్రసవాలు నిర్వహించగలుగుతున్నామని చెప్పారు.

ప్రసవ సమయం దగ్గరపడిన వెంటనే గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయించాలని, ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ప్రసూతి సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.