తిరువూరు ఆసుపత్రికి కొత్త ఊపిరి

తిరువూరు ఆసుపత్రికి కొత్త ఊపిరి

అభివృద్ధికి 35 కీలక నిర్ణయాలు

రోగులను పరామర్శించిన ఎమ్మెల్యే కొలికపూడి  

 సమస్యలపై ఆరా  మెరుగైన వైద్య సేవలకు హామీ

(తిరువూరు, ఆంధ్రప్రభ)

తిరువూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని మరింత ఆధునికంగా తీర్చిదిద్దే దిశగా కీలక అడుగు పడింది. ఆసుపత్రి అభివృద్ధికి సంబంధించి 35 ప్రధాన అంశాలకు గురువారం నిర్వహించిన అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆమోదం లభించింది. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అధ్యక్షత జరిగిన సమావేశంలో ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల పెంపు, వైద్య సేవల విస్తరణ, ఆధునిక పరికరాల ఏర్పాటు, రోగులకు అందుతున్న సేవల నాణ్యత పెంపు వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందేలా అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు  సూచించారు.

ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దడమే లక్ష్యంగా చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను ప్రత్యక్షంగా పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితి, ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు.

మందులు, పరీక్షలు, వసతుల్లో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. ప్రజారోగ్యమే ప్రభుత్వ ప్రాధాన్యత అని, గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు  తెలిపారు. ఈ సమావేశంలో అభివృద్ధి కమిటీ డైరెక్టర్లు డాక్టర్ జయసింహా, ఆకుల దుర్గ ప్రసాద్, మామిడి వెంకటమ్మ, ఆసుపత్రి సూపరింటెండెంట్ భానుతేజతో పాటు వైద్యులు, నర్సులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply