తుమ్మల సంకల్పానికి రూపం.. ఖమ్మంలో శ్రీవారి ఆలయం
తుమ్మల సంకల్పానికి రూపం.. ఖమ్మంలో శ్రీవారి ఆలయం
అల్లిపురంలో టీటీడీ ఆలయానికి భూమి అప్పగింత
ఖమ్మం, ఆంధ్రప్రభ: ఖమ్మం జిల్లా ఆధ్యాత్మిక చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన 20 ఎకరాల 4 కుంటల భూమిని అధికారులు అధికారికంగా దేవస్థానానికి అప్పగించారు. రెండు నెలల క్రితం కేబినెట్ ఆమోదం పొందిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు కార్యరూపం దాల్చే దశకు చేరుకుంది.
ఈ ఆలయం కోసం తొలి నుంచి ప్రత్యేకంగా కృషి చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాత్రకు ప్రాధాన్యం ఏర్పడింది. భద్రాచలం తర్వాత ఖమ్మాన్ని మరో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దాలన్న ఆయన సంకల్పం ఫలితమిస్తోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ఖమ్మం అర్బన్ మండలం అల్లిపురం గ్రామ పరిధిలోని 20 ఎకరాల 4 కుంటల భూమిని శుక్రవారం టీటీడీ అధికారులకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సర్వేయర్ హరినాథ్, అసిస్టెంట్ ఇంజినీర్ చెలికాని జగన్మోహన్‌రావు, సహాయకుడు బాలాజీ పాల్గొన్నారు.
రెవెన్యూ శాఖ తరఫున ఖమ్మం అర్బన్ తహసీల్దార్ డి. జయచందర్, సర్వేయర్ నాగేశ్వరరావు, గిర్దావర్ సత్యనారాయణ హాజరయ్యారు. భూమి హద్దులను పరిశీలించిన అనంతరం అధికారికంగా దేవస్థానానికి భూమిని అప్పగించారు. దీంతో ఆలయ నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక ప్రక్రియలు పూర్తయ్యాయి.
ఖమ్మం జిల్లాలో టీటీడీ ఆలయం నిర్మించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. జిల్లాలో భక్తుల ఆకాంక్షలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన వారిలో ఆయన ముందున్నారు. తిరుమలకు వెళ్లలేని సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం చేరువ కావాలన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా ప్రతిపాదన చేశారు.
రెండు నెలల క్రితం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆలయ నిర్మాణానికి భూమి కేటాయింపుపై ఆమోదం లభించింది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ అంశానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. అనంతరం రెవెన్యూ శాఖ అధికారులు భూకేటాయింపుకు సంబంధించిన ప్రక్రియలను వేగవంతం చేశారు.
శుక్రవారం జరిగిన భూహస్తాంతరణతో ప్రాజెక్టుకు అధికారికంగా శ్రీకారం చుట్టినట్లైంది. ఇక నిర్మాణ నమూనాలు, అభివృద్ధి పనులపై టీటీడీ దృష్టి సారించనుంది. త్వరలోనే నిర్మాణ పనులకు సంబంధించిన తదుపరి చర్యలు ప్రారంభం కానున్నాయి.
భద్రాచలం ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక క్షేత్రంగా గుర్తింపు పొందింది. ఇప్పుడు శ్రీవారి ఆలయం నిర్మాణంతో ఖమ్మం జిల్లాకు మరో విశిష్టత చేరనుంది. జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల భక్తులకు కూడా ఈ ఆలయం ప్రయోజనకరంగా మారనుంది.
తిరుమల వెళ్లేందుకు వీలులేని వృద్ధులు, సామాన్య భక్తులకు ఈ ఆలయం ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. శ్రీవారి నిత్యపూజలు, ఉత్సవాలు, ధార్మిక కార్యక్రమాలు జిల్లాలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత పెంపొందించే అవకాశముంది.
ఆలయ నిర్మాణంతో ఖమ్మం ప్రాంతంలో పర్యాటక కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉంది. భక్తుల కోసం వసతి గృహాలు, శుభకార్యాల వేదికలు, ధార్మిక కేంద్రాలు, పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
దీనివల్ల స్థానిక వ్యాపారాలు, చిన్న వ్యాపారులకు ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. హోటళ్లు, రవాణా, సేవా రంగాలకు కూడా కొత్త ఆదాయం లభించే పరిస్థితి ఏర్పడనుంది. ఖమ్మాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యానికి ఈ ప్రాజెక్టు పునాదిగా నిలవనుంది.

