తోతాపురి రైతులకు అండగా ప్రభుత్వం
ధరల పతనంపై కలెక్టర్‌తో కేంద్ర నిపుణుల కమిటీ సమీక్ష..
రైతులు, ఎఫ్‌పీఓలు, ఎగుమతిదారులతో విస్తృత చర్చలు
తిరుపతి, జూలై 9 (ఆంధ్రప్రభ): తోతాపురి మామిడి ధరలు భారీగా తగ్గడంతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ గురువారం తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్‌తో సమావేశమైంది. జిల్లాలో మామిడి సాగు పరిస్థితులు, మార్కెట్ పరిస్థితులు, రైతుల సమస్యలపై కలెక్టర్‌తో పాటు సంబంధిత అధికారులతో సవివరంగా చర్చించింది.
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశాల మేరకు జూలై 8, 9 తేదీల్లో నిపుణుల కమిటీ తిరుపతి జిల్లాలో పర్యటించింది. ఈ సందర్భంగా తోతాపురి మామిడి సాగు చేస్తున్న రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్‌పీఓలు), ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతిదారులు, ఉద్యానవన శాఖ అధికారులతో సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకుంది.
జిల్లాలో తోతాపురి మామిడి సాగు విస్తీర్ణం, దిగుబడులు, ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, ధరలు తగ్గడానికి గల కారణాలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కొనుగోలు విధానం, ప్రాసెసింగ్, ఎగుమతుల అవకాశాలపై కమిటీ సభ్యులు వివరంగా చర్చించారు. రైతులకు గిట్టుబాటు ధర లభించేలా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్ జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలు, మార్కెటింగ్ సదుపాయాలు, ధరల స్థిరీకరణకు జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను కమిటీకి వివరించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అవసరమైన సూచనలు, సిఫార్సులతో కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
సమావేశంలో ఐసీఏఆర్ సీఐఎస్‌హెచ్ డైరెక్టర్ దామోదరన్, ఐసీఏఆర్ ఐఐహెచ్‌ఆర్ హెడ్ శంకరన్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ హెచ్.ఎస్. సింగ్, అదనపు ఉద్యానవన సంచాలకులు హరినాథ రెడ్డి, సంయుక్త ఉద్యానవన సంచాలకులు దేవముని రెడ్డి, ఉద్యానవన, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
