‘బాలామృతం ప్లస్’ పంపిణీ ప్రారంభం
తిరుపతి కలెక్టరేట్, ఆంధ్రప్రభ : జిల్లాలోని చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించే లక్ష్యంతో చేపట్టిన ‘బాలామృతం ప్లస్’ (ఎనర్జీ డెన్స్ ఫుడ్) పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ వెంకటేశ్వర్ సోమవారం కలెక్టరేట్‌లో ప్రారంభించారు. టాటా ట్రస్ట్స్ సహకారంతో విజయవాహిని ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లాలో తీవ్రమైన పోషకాహార లోపం (ఎస్‌ఏఎం), మితమైన పోషకాహార లోపం (ఎంఏఎం)తో బాధపడుతున్న 2,248 మంది చిన్నారులను మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు గుర్తించారు. వారికి బాలామృతం ప్లస్‌ను పంపిణీ చేయనున్నారు.
పోషకాహార లోపాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రతి చిన్నారికి నెలకు 3 కిలోల చొప్పున బాలామృతం ప్లస్ అందించనున్నారు. ఈ కార్యక్రమం కోసం జిల్లాకు 7,081 కిలోల బాలామృతం ప్లస్ సరఫరా చేసినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గోవిందరావు ఐఏఎస్, జిల్లా మహిళా, శిశు సంక్షేమ సాధికారత అధికారిణి వసంతబాయి, నోడల్ ఆఫీసర్ వాసంతి, జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ అమరావతి, విజయవాహిని ఫౌండేషన్ ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
