ఎమ్మెల్యే సామేల్ పై విమర్శలు చేస్తే సహించేది లేదు

  • కాంగ్రెస్ నాయకుల హెచ్చరిక

మోత్కూరు, ఆంద్రప్రభ: తుంగతుర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ పై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తే సహించేది లేదని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాచకొండ బాలరాజు గౌడ్, మోత్కూర్ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం స్వప్న సోమ నరసయ్య హెచ్చరించారు.

గురువారం స్థానిక రహదారి బంగ్లా విశ్రాంతి భవనంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిచిన రెండున్నర ఏళ్లలో మోత్కూరు ప్రధాన రహదారి అద్వానంగా ఉండేదని, స్థానిక పాత బస్టాండ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ( రెండు వరుసలు ) సీసీ రోడ్డు శాశ్వత నిర్మాణం పూర్తి చేయించారని తెలిపారు. స్థానిక సేక్రెట్ హార్ట్ హైస్కూల్ వెనుక భాగంలో నాలుగున్నర ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తున్న తరుణంలో ఆ భూమిని కాపాడడానికి ఎమ్మెల్యే సామేల్ హైకోర్టులో కేసు వేసి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చేలా కృషి చేశారన్నారు.

మండలంలోని అన్ని గ్రామాలలో ఎన్.ఆర్.జి.ఐ. పథకాలతో రూ. 2.25 కోట్లు ఖర్చు చేశారన్నారు. అదేవిధంగా మండలంలోని 10 గ్రామాలలో 167 ఇందిరమ్మ ఇండ్లు, మున్సిపల్ లో 166 ఇందిరమ్మ ఇండ్లు, మండలంలో పైలెట్ ప్రాజెక్టు కింద పాటిమట్ల గ్రామానికి 46 ఇండ్లను ఎమ్మెల్యే మంజూరు చేశారన్నారు. ఎమ్మెల్యే సామెల్ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారని, ఈ ప్రాంత బిడ్డగా నియోజకవర్గంతో పాటు మోత్కూర్ మున్సిపాలిటీ, మోత్కూరు మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని వివరించారు.

అందులో భాగంగా త్వరలో మోత్కూరుకు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మంజూరు కానున్నాయని, మోత్కూరు-గుండాల బిక్కేరు బ్రిడ్జి వెడల్పుకు నిధులు కేటాయించనున్నట్లు చెప్పారు. 1 కోటి 50 లక్షలు బృందావన్ కాల్వ మరమ్మతులకు నిధులు కేటాయించారని, త్వరలో పనులు ప్రారంభం కానున్నాయన్నారు .గత ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ రెండు సార్లు ఎమ్మెల్యే ఎన్నికైనప్పటికీ ఈ నియోజకవర్గాన్ని ఏం మాత్రం పట్టించుకోలేదన్నారు. అభివృద్ధి దిశగా నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే సామేల్ పై విమర్శలు మానుకొని అభివృద్ధి దిశగా చేసే పనులపై ప్రతిపక్షాలు సలహాలు,సూచనలు ఇవ్వాలని కోరారు.

రాష్ట్ర షెడ్యూల్ కులాల కమిటీ లో సభ్యులుగా ఎమ్మెల్యే సామేల్ ను నియమించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర మంత్రి వర్గానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో మోత్కూర్ సింగిల్విండో చైర్మెన్ పేలపూడి వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పన్నాల శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్రం లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా మాజీ కార్యదర్శి మందుల సురేష్, మహిళా కాంగ్రెస్ పట్టణ, మండల అధ్యక్షురాలు అన్నెపు పద్మ, ముద్దం జయశ్రీ, మాజీ సర్పంచులు చేతరాశి అంజయ్య,చింతల విజయభాస్కర్ రెడ్డి, మండల నాయకులు ఎడ్ల భగవంత్ , పల్లపు సమ్మయ్య, దేవరపల్లి అశోక్ రెడ్డి, పల్లె బిక్షం, సుంకిశాల అనిల్ గూండా రాములు, మెంట యాదగిరి తదితరులు పాల్గొన్నారు.