రూ.47 కోట్ల అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్‌

  • యువతకు అత్యాధునిక నైపుణ్య శిక్షణ..
  • మెరుగైన ఉపాధి అవకాశాలే ప్రభుత్వ లక్ష్యం
  • మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: యువతను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలతో తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. నారాయణఖేడ్ మండలం జూకల్ శివారులో రూ.47 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)కు గురువారం మంత్రి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం యువతకు నాణ్యమైన నైపుణ్య శిక్షణ అందించి దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తోందన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతిక కోర్సుల్లో శిక్షణ అందించడం ద్వారా యువత ఉద్యోగాలతో పాటు స్వయం ఉపాధి అవకాశాలను కూడా అందిపుచ్చుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

స్థానిక యువతకు కొత్త అవకాశాల దారులు తెరుస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ కేంద్రం ప్రాంత అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి మాట్లాడుతూ నైపుణ్యాభివృద్ధే యువత భవిష్యత్తుకు బలమైన పునాది అని అన్నారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ద్వారా గ్రామీణ ప్రాంతాల యువతకు ఆధునిక సాంకేతిక శిక్షణ అందుబాటులోకి రావడం వల్ల ఉద్యోగ అవకాశాలు మరింత విస్తరిస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్, సబ్ కలెక్టర్ ఉమాహారతి, సంబంధిత శాఖల అధికారులు, తహసీల్దార్ పాల్గొన్నారు.