Rotten Meat Seized Tirupati | మటన్ మార్కెట్‌లో కుళ్లిన మాంసం గుట్టురట్టు!

Rotten Meat Seized Tirupati | మటన్ మార్కెట్‌లో కుళ్లిన మాంసం గుట్టురట్టు!

Rotten Meat Seized Tirupati |తిరుపతి, ఆంధ్రప్రభ :

తిరుపతి నగరంలోని మాంసాహార ప్రియులను ఉలిక్కిపడేలా చేసే ఘటన వెలుగులోకి వచ్చింది. నగరంలోని 28వ వార్డు పెద్దపీర్‌ల చావడి మటన్ మార్కెట్‌లో భారీ ఎత్తున నిల్వ ఉంచిన కుళ్లిపోయిన మాంసాన్ని నగరపాలక సంస్థ అధికారులు గుర్తించి సీజ్ చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే విధంగా దుర్వాసన వెదజల్లుతున్న మాంసాన్ని విక్రయిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టారు.

నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ ఆధ్వర్యంలో పారిశుధ్య సిబ్బంది శుక్రవారం ఉదయం ఆకస్మికంగా మటన్ మార్కెట్‌పై దాడులు నిర్వహించారు. తనిఖీల్లో ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన మేకలు, పొట్టేళ్ల తలకాయలు, కాళ్లు తదితర భాగాలను ఫ్రీజర్లలో నెలల తరబడి నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు గుర్తించారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, సుమారు అర టన్నుకు పైగా నిల్వ ఉంచిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. కొన్ని మాంసపు భాగాలు పూర్తిగా కుళ్లిపోయి తీవ్ర దుర్వాసన వెదజల్లుతున్నాయని, వాటిని ఫ్రీజర్ల నుంచి బయటకు తీయడానికి ఇనుప చువ్వల సహాయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు. మార్కెట్ పరిసరాలు కూడా తీవ్ర అపరిశుభ్రతతో ఉండటం ఆందోళన కలిగించింది.

నగరపాలక సంస్థ కమిషనర్ శారదాదేవి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ ప్రత్యేక తనిఖీల్లో, నగరపాలక సంస్థ చట్టం–1955లోని పలు సెక్షన్ల కింద చర్యలు చేపట్టినట్లు హెల్త్ ఆఫీసర్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న కుళ్లిన మాంసంపై క్రిమిసంహారక మందులు పిచికారీ చేసి కంపోస్ట్ యార్డుకు తరలించారు.

ఈ సందర్భంగా డాక్టర్ యువ అన్వేష్ వ్యాపారులకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతూ కుళ్లిన మాంసం లేదా నిల్వ ఆహార పదార్థాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, భారీ జరిమానాలతో పాటు ట్రేడ్ లైసెన్సులు కూడా రద్దు చేస్తామని స్పష్టం చేశారు.

మాంసం కొనుగోలు చేసే సమయంలో నాణ్యత, వాసన, పరిశుభ్రతను తప్పనిసరిగా పరిశీలించాలని, అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే నగరపాలక సంస్థ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ తనిఖీల్లో శానిటరీ సూపర్‌వైజర్ చెంచయ్య, మేస్త్రిలు, వార్డు కార్యదర్శులు, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply