అనుపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

  • ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు వలస కూలీల మృతి
  • 20 మందికి తీవ్ర గాయాలు

వేములవాడ, ఆంధ్రప్రభ: బతుకుదెరువు కోసం మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన కూలీలను తిరుగు ప్రయాణంలో మృత్యువు వెంటాడింది. నాట్లు వేసి తిరిగి వస్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు వలస కూలీలు అక్కడికక్కడే మృతిచెందగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామ శివారులో గురువారం ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహారాష్ట్రకు చెందిన వలస కూలీలు వ్యవసాయ పనుల కోసం తంగళ్లపల్లి మండలం లక్ష్మీపురానికి వెళ్లి నాట్లు పూర్తి చేసుకుని బోయినపల్లి మండలం వరదవెల్లిలోని తమ నివాసాలకు టాటా ఏస్ ట్రాలీలో తిరుగు ప్రయాణమవుతున్నారు. ఈ క్రమంలో అనుపురం వద్ద సిరిసిల్ల నుంచి వరంగల్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి వారి వాహనాన్ని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన అతుల్ (35)తో పాటు మరో కూలీ అక్కడికక్కడే మృతిచెందారు. మరో 20 మంది వరకు కూలీలు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఘటనాస్థలం విషాదంగా మారింది. ప్రమాదంలో ఓ ద్విచక్రవాహనం కూడా పూర్తిగా ధ్వంసమైంది.

సమాచారం అందుకున్న వేములవాడ పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో క్షతగాత్రులను సిరిసిల్ల, వేములవాడ పరిసర ఆసుపత్రులకు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ మహేశ్ బి. గితే ప్రమాద స్థలాన్ని పరిశీలించి, అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.