ప్రోటోకాల్ రగడ
- ఈఎస్ఐ డిస్పెన్సరీ ప్రారంభోత్సవానికి ఆహ్వానం లేకపోవడంపై మెదక్ ఎంపీ రఘునందన్ ఆగ్రహం
- అధికారులకు నోటీసులు.. స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరిక
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: సంగారెడ్డిలో నూతనంగా ప్రారంభించిన ఈఎస్ఐ డిస్పెన్సరీ ప్రారంభోత్సవం ప్రోటోకాల్ వివాదానికి దారితీసింది. స్థానిక ఎంపీ అయినా కార్యక్రమానికి ఆహ్వానం అందకపోవడంపై మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై లేదా అని ప్రశ్నించారు.
సమాచారం ఇవ్వని జిల్లా సంబంధిత అధికారులకు నోటీసులు పంపిస్తానని, ఈ వ్యవహారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు పార్లమెంట్ స్పీకర్‌కు కూడా ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. గురువారం సంగారెడ్డిలో నిర్వహించిన జర్నలిస్టుల మహాసభ కార్యక్రమానికి హాజరైన ఎంపీ రఘునందన్, అక్కడే ఉన్న సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో ఈ అంశంపై చర్చించినట్లు తెలిసింది.
ఇదే సమయంలో సంగారెడ్డిలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ కలిసి నూతన ఈఎస్ఐ డిస్పెన్సరీని ప్రారంభించారు. అయితే మెదక్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని సంగారెడ్డిలో జరిగిన ఈ అధికారిక కార్యక్రమానికి స్థానిక ఎంపీగా తనను ఆహ్వానించకపోవడాన్ని రఘునందన్ రావు ప్రోటోకాల్ ఉల్లంఘనగా అభివర్ణించినట్లు సమాచారం.
ఈ విషయంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా, సంబంధిత అధికారుల తీరుపై కఠినంగా స్పందించినట్లు తెలిసింది. జిల్లా స్థాయి అధికారులు కావాలనే సమాచారాన్ని దాచిపెట్టారా? లేక ప్రోటోకాల్‌ను నిర్లక్ష్యం చేశారా? అనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రజా ప్రతినిధుల అధికారిక గౌరవాన్ని కించపరిచేలా వ్యవహరిస్తే సహించబోనని ఎంపీ రఘునందన్ రావు స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ ఘటన స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారగా, అధికార వర్గాల నుంచి దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.
