ప్రత్యేక అవసరాల విద్యార్థులకు రూ.45 లక్షల విలువైన ఉపకరణాల పంపిణీ

ప్రత్యేక అవసరాల విద్యార్థులకు రూ.45 లక్షల విలువైన ఉపకరణాల పంపిణీ

తిరుపతి, ఆంధ్రప్రభ: ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు అవసరమైన సహాయక ఉపకరణాలను అందించడం ద్వారా వారి సామర్థ్యాలను పెంపొందించి సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా చేయడం ప్రభుత్వ లక్ష్యమని జాయింట్ కలెక్టర్ గోవిందరావు తెలిపారు.

తిరుపతి బైరాగిపట్టెడ ఎంజీఎం మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్‌లో సోమవారం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జేసీ గోవిందరావు విద్యార్థులకు ఉపకరణాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల పిల్లలపై జాలి చూపడం కంటే వారిలోని ప్రతిభ, సామర్థ్యాలను గుర్తించి ప్రోత్సహించాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు సూచించారు. మూడు నుంచి 18 సంవత్సరాల లోపు ప్రత్యేక అవసరాలు గల పిల్లలందరూ భవిత కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

2025–26 విద్యా సంవత్సరంలో 2,056 మంది ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు సమగ్ర శిక్ష ద్వారా వివిధ రకాల భత్యాలు అందించినట్లు తెలిపారు.

జిల్లా విద్యాశాఖ అధికారి కేవీఎన్ కుమార్ మాట్లాడుతూ అలింకో సంస్థ సహకారంతో రూ.45 లక్షల విలువైన సహాయక ఉపకరణాలను 499 మంది విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలిపారు. విద్యార్థులు ఈ పరికరాలను సద్వినియోగం చేసుకొని తమ అభ్యాస సామర్థ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు.

సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ భరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతి సంవత్సరం భారీగా నిధులు వెచ్చిస్తూ ఉచిత ఉపకరణాలు, భత్యాలు అందిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో హియరింగ్ ఎయిడ్స్, వీల్‌చైర్లు, రోలేటర్లు, ట్రైసైకిళ్లు, బ్రెయిల్ కిట్లు, టీఎల్‌ఎమ్ కిట్లు తదితర ఉపకరణాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. విద్యాశాఖ, సమగ్ర శిక్ష అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *