నిష్పక్షపాతంగా ఫిర్యాదుల పరిష్కారం చేయాలి:
ఎస్పీ సుబ్బరాయుడు
తిరుపతి, ఆంధ్రప్రభ : ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును చట్టపరంగా, నిష్పక్షపాతంగా విచారించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పోలీసు అధికారులను ఆదేశించారు.
సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన అధ్యక్షతన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 66 ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించి, బాధితుల సమస్యలను స్వయంగా ఆలకించారు.
ప్రతి పిటిషన్‌ను అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి, చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా నిష్పక్షపాత విచారణ చేపట్టి బాధితులకు సకాలంలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అందిన ప్రతి ఫిర్యాదును వెంటనే సంబంధిత అధికారులకు పంపించి, నిర్ణీత గడువులో విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించడంతో పాటు సమస్యకు తగిన పరిష్కారం చూపాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో జాప్యం, నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు.
ప్రతి అధికారి సేవాభావంతో, పారదర్శకంగా విధులు నిర్వహిస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలని ఎస్పీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రవి మనోహర ఆచారి (శాంతిభద్రతలు), శ్రీలత (మహిళా పోలీస్ స్టేషన్), ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, ఫిర్యాదుదారులు పాల్గొన్నారు.
