పీజీఆర్ఎస్‌లో 461 అర్జీలు స్వీకరణ…

పీజీఆర్ఎస్‌లో 461 అర్జీలు స్వీకరణ…

పెండింగ్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలి

తిరుపతి, ఆంధ్రప్రభ: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అందిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ గోవిందరావు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అర్జీదారులకు గౌరవప్రదంగా కూర్చునేందుకు ఏర్పాట్లు చేయడంతో పాటు తాగునీరు, వైద్య శిబిరం, టీ సరఫరా వంటి సౌకర్యాలు కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను అధికారులు స్వయంగా విని అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్‌లో అందిన ప్రతి అర్జీని సకాలంలో పరిష్కరించాలని సూచించారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్‌లో ఉన్న అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని, పీజీఆర్ఎస్ అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శివశంకర్ నాయక్, భరత్ నాయక్, రోజ్‌మాండ్‌లతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అర్జీలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి సంబంధిత రసీదులను అర్జీదారులకు అందజేశారు.

ఈ పీజీఆర్ఎస్‌లో మొత్తం 461 అర్జీలు అందాయి. వీటిలో రెవెన్యూ శాఖకు 270 అర్జీలు, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్‌కు 23, సర్ఫ్‌కు 20, పంచాయతీరాజ్‌కు 19, ఎస్‌ఎస్‌ఎల్‌ఆర్‌కు 19, హోం శాఖకు 16, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌కు 14, సివిల్ సప్లైస్‌కు 11 అర్జీలు వచ్చాయి. మిగిలిన అర్జీలు వివిధ శాఖలకు సంబంధించినవిగా నమోదయ్యాయి.