ఇక వందశాతం డిజిటల్ చెల్లింపులే లక్ష్యం..

తిరుపతి, రాయలసీమ బ్యూరో ఆంధ్రప్రభ : రాయలసీమ, నెల్లూరు జిల్లాల పరిధుల్లో విద్యుత్ బిల్లుల చెల్లింపులన్నీ వంద శాతం డిజిటల్ చెల్లింపులే జరిగేలా చూడడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు   సదరన్ పవర్ డిస్కమ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి స్పష్టం చేశారు. ఇందుకోసం దశలవారీ గా బిల్లు వసూలు కేంద్రాలను మూసివేయడం, డిజిటల్ చెల్లింపులపై వినియోగదారులకు విస్తృతంగా అవగాహన కలిగించండం, ఆన్ లైన్ చెల్లింపులతో పాటు అధికారిక  మొబైల్ యాప్ ను అందరికీ అందుబాటులో తేవడం వంటి చర్యలను ముమ్మరం చేయాలని ఆయా అన్ని జిల్లాల సూపరింటెండింగ్ ఇంజనీర్లకు ఆదేశాలు జారీచేసినట్టు తెలిపారు.    

తిరుపతి కేంద్రంగా  తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి , నెల్లూరు జిల్లాలు పరిధిగా పనిచేసే సదరన్ డిస్కం కింద 61.32 లక్షల మంది విద్యుత్ వినియోగదారులున్నారు. వారినుంచి  ప్రతి నెలా సుమారు రూ.520 కోట్ల విలువైన విద్యుత్ బిల్లుల చెల్లింపులు జరుగుతున్నాయి. అయితే అందులో ప్రస్తుతం మొత్తం బిల్లుల్లో 49.50 శాతం ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి. డిజిటల్ యుగానికి అనుగుణంగా అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ వినియోగదారులకు విద్యుత్ సేవలను మరింత సరళతరం చేసి లక్ష్యం తో మొత్తం 100 శాతం డిజిటల్ చెల్లింపులు అమలు చేసే దిశగా అడుగులు వేయాలని నిర్ణయించుకున్నట్టు శివశంకర్ తెలిపారు. 

విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు వినియోగదారులు బిల్లు వసూళ్ల కేంద్రాల వద్ద గంటల తరబడి క్యూలో వేచివుండాల్సిన అవసరం లేకుండా ఎపిఎస్‌పిడిసిఎల్ అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్, డైనమిక్ క్యూ ఆర్ కోడ్, వాట్సాప్ గవర్నెన్స్ (మనమిత్ర), నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా విద్యుత్ బిల్లులను సులభంగా చెల్లించవచ్చని పేర్కొన్నారు. మొబైల్ యాప్ ద్వారా విద్యుత్ వినియోగ వివరాలు, గత బిల్లు చెల్లింపుల చరిత్రను తెలుసుకోవడంతో పాటు కొత్త విద్యుత్ సేవలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కల్పించామన్నారు. డిజిటల్ చెల్లింపులను మరింత ప్రోత్సహించే దిశగా చేపట్టే చర్యల్లో భాగంగా బిల్లుల వసూళ్లలో పారదర్శకతను మరింత పెంపొందించేందుకు, నగదు లావాదేవీలను తగ్గించేందుకు దశలవారీగా బిల్లు వసూళ్ల కేంద్రాలను మూసివేసే ప్రక్రియను అమలు చేయాలని ఆయా జిల్లాల సూపరింటెండెంట్ ఇంజనీర్లను ఆదేశించారు. అదేసమయంలో సులభతరమైన డిజిటల్ చెల్లింపు విధానాలపై వినియోగదారులకు అవగాహన పెంపొందించే చర్యలు చేపట్టాలని నిర్ధేశించారు.