యాదాద్రి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

యాదాద్రి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

పాత అన్నదాన సత్రం పరిశీలించిన చైర్మన్

భక్తుల సౌకర్యాల విస్తరణ, పాలక మండలి కార్యాలయ వినియోగంపై సమీక్ష
పునర్నిర్మాణం, ఆధునీకరణకు కార్యాచరణ రూపొందించాలని ఆర్కిటెక్ట్‌లకు సూచనలు

యాదగిరిగుట్ట, ఆంధ్ర‌ప్ర‌భ‌ : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నూతన పాలక మండలి చైర్మన్ బి. సత్యనారాయణ రెడ్డి మంగళవారం యాదగిరిగుట్టలోని పాత అన్నదాన సత్ర సముదాయాన్ని సందర్శించి పరిశీలించారు. వరంగల్ పర్యటనకు వెళ్తున్న సందర్భంగా యాదాద్రికి చేరుకున్న ఆయన, సాంకేతిక నిపుణులు, ఆర్కిటెక్ట్‌ల బృందంతో కలిసి భవన స్థితిగతులను పరిశీలించారు.

పాత అన్నదాన సత్రాన్ని భవిష్యత్తులో పాలక మండలి కార్యాలయంగా లేదా భక్తుల సౌకర్యాల కోసం ఎలా వినియోగించవచ్చనే అంశంపై ఆర్కిటెక్ట్‌లతో చర్చించారు. భవనం ప్రస్తుత పరిస్థితి, పునర్నిర్మాణ అవకాశాలు, అవసరమైన మరమ్మతులు, ఆధునీకరణ పనులపై సమగ్రంగా పరిశీలించి తగిన సూచనలు చేశారు.

ఇప్పటికే ఆలయ పరిసరాల్లోని సైన్‌బోర్డులు, భవనాలు, వసతి సముదాయాలపై ఆర్కిటెక్చర్ బృందం నిర్వహించిన సర్వే నివేదికల ఆధారంగా పాత అన్నదాన సత్రం అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని చైర్మన్ సూచించారు. భక్తులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేలా నూతన డిజైన్లను సిద్ధం చేయాలని ఆదేశించారు.

దేవస్థాన అభివృద్ధి, భక్తులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా నూతన పాలక మండలి పనిచేస్తోందని ఈ సందర్భంగా చైర్మన్ తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదాద్రిలో కూడా ఆధునిక సౌకర్యాలను మరింత విస్తరించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.