నెలాఖరులోపు జనగణన పూర్తి చేయాలి

నెలాఖరులోపు జనగణన పూర్తి చేయాలి

ప్రతి ఇంటి వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశం
సమన్వయంతో సర్వే ప్రక్రియ వేగవంతం చేయాలి

తిరుపతి, ఆంధ్రప్రభ : జనగణన కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో తీసుకుని ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులతో కలిసి నిర్వహించిన వర్చువల్ సమీక్షలో ఆయన మాట్లాడారు.

జనగణన ప్రక్రియలో 2011 గణాంకాలతో పోల్చి ఎటువంటి వ్యత్యాసాలు లేకుండా ఖచ్చితత్వంతో డేటా నమోదు చేయాలని తహసీల్దార్లు, ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు సూచించారు. జిల్లాలో ప్రతి ఇంటి వివరాలు సమగ్రంగా నమోదు చేయాలని, ఎవరూ మిగలకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

తహసీల్దార్లు, ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు సమన్వయంతో పనిచేసి నిర్దేశిత గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించి సర్వే ప్రక్రియకు ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

జనగణన ద్వారా ప్రభుత్వ ప్రణాళికలు, సంక్షేమ కార్యక్రమాల అమలుకు అవసరమైన కీలక సమాచారం సిద్ధమవుతుందని, ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ పేర్కొన్నారు.