TIDCO HOUSES | కర్నూలు జిల్లాలో టిడ్కో ఇళ్ల పంపిణీకి శ్రీకారం
- సోమవారం తొలి విడతగా 187 ఇళ్ల గృహప్రవేశాలు
- 2026 మార్చిలోగా వందశాతం లక్ష్యం
TIDCO HOUSES | కర్నూలు జిల్లాలో టిడ్కో ఇళ్ల పంపిణీకి శ్రీకారంకర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ఏపీ టిడ్కో ఇళ్ల కోసం సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు ఎట్టకేలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 18 నెలలు గడిచినా పంపిణీ ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో లబ్ధిదారులు ఆశలు వదులుకున్నారు. గత జూన్‌లో గృహనిర్మాణ శాఖ మంత్రి డాక్టర్ పి. నారాయణ టిడ్కో ఇళ్ల పంపిణీ చేస్తామని ప్రకటించినా, దసరా వరకూ కూడా ఆ హామీ కార్యరూపం దాల్చలేదు. అయితే ఇటీవల ఉమ్మడి జిల్లాలో పర్యటించిన మంత్రి నారాయణ, వచ్చే సంక్రాంతికల్లా అన్నిరకాలుగా టిడ్కో ఇళ్ల పంపిణీ పూర్తి చేస్తామని, పూర్తిగా సిద్ధమైన ఇళ్లను ముందుగా అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం చెప్పినట్టుగానే—సోమవారం (17న) కర్నూలు నగరంలో తొలి విడతగా 187 ఇళ్ల గృహప్రవేశాలకు ముహూర్తం ఖరారు చేయడంతో లబ్ధిదారుల్లో హర్షం నెలకొంది. తదుపరి వారాల్లో దశల వారీగా పంపిణీ కొనసాగించడానికి అధికార యంత్రాంగం పూర్తిగా సిద్ధమైంది.
31,586 టిడ్కో ఇళ్లలో 23,645 ఇళ్లు పూర్తి.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన–ఎన్టీఆర్ ఇళ్లు పథకం ఫేజ్–1 కింద కేవలం కర్నూలు నగరం, ఆదోని, ఎమ్మిగనూరు, నంద్యాల పట్టణాల్లో మొత్తం 27,976 ఇళ్లు, ఫేజ్–2 కింద డోన్, ఆళ్లగడ్డలో 2,610 ఇళ్లు — మొత్తం 31,586 ఏపీ టిడ్కో ఇళ్లు మంజూరయ్యాయి. వీటి నిర్మాణం కోసం షేర్‌వాల్ టెక్నాలజీతో జీ+3 స్థాయి భవనాలు నిర్మించారు. మహారాష్ట్రకు చెందిన శాపూజీ–పల్లంజీ సంస్థ నిర్మాణ బాధ్యతలను చేపట్టగా, ఏపీ టిడ్కో ఇంజనీర్లు పర్యవేక్షిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు విడతల్లో మొదలైన 29,672 ఇళ్లలో ఇప్పటివరకు 23,645 ఇళ్లు దాదాపు పూర్తయ్యాయి.
మౌలిక వసతుల కోసం మరో రూ.180 కోట్ల అవసరం
టిడ్కో ఇళ్ల సముదాయాల్లో రోడ్లు, విద్యుత్, డ్రైనేజ్, తాగునీరు వంటి మౌలిక వసతుల కల్పన, అసంపూర్తి పనులు, కాంట్రాక్టర్‌ల పెండింగ్ బిల్లుల కోసం మొత్తం రూ.180.03 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. నిధుల విడుదలలో జాప్యం కారణంగా పనులు నిలిచిపోయాయి. నిధులు అందితేనే మిగిలిన పనులు పూర్తి చేస్తాం అని కాంట్రాక్టర్‌లు స్పష్టం చేయడంతో ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది.
ప్రతి శనివారం గృహప్రవేశాలు.. మార్చి 2026లోగా వందశాతం లక్ష్యం
రాష్ట్ర ప్రభుత్వం, టిడ్కో అధికారులు కలిసి ప్రతి శనివారం గృహప్రవేశాలు నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారు. దశల వారీగా పంపిణీ చేస్తూ, 2026 మార్చి చివరినాటికి 100 శాతం టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించడం లక్ష్యం. పూర్తయిన బ్లాకుల్లోని ఇళ్లకు వెంటనే మౌలిక వసతులు కల్పించి కేటాయించేందుకు ప్రత్యేక డ్రైవ్ సిద్ధం చేశారు. జిల్లా స్థాయిలో మున్సిపల్ అధికారులు, ఏపీ టిడ్కో అధికారులకు స్పష్టమైన టైమ్‌లైన్లు ఇచ్చారు.
187 ఇళ్లతో తొలి విడత ప్రారంభం
సుదీర్ఘ నిరీక్షణకు తెరదింపుతూ, నవంబర్ 17న కర్నూలు నగరంలో 187 టిడ్కో ఇళ్ల గృహప్రవేశాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కార్యక్రమంతో జిల్లాలో టిడ్కో ఇళ్ల పంపిణీ నూతన దశకు ప్రవేశించనుంది. లబ్ధిదారుల ముఖాలు కాస్త వెలిగాయి… తమ సొంత ఇల్లు కల నిజమవుతుందన్న ఆశ ఇప్పుడు మరింత బలపడింది.
