Cricket | నేడే న్యూజిలాండ్, భారత్ తొలి వన్డే

Cricket | నేడే న్యూజిలాండ్, భారత్ తొలి వన్డే
- వడోదరలోని BCA స్టేడియంలో మ్యాచ్
- మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం
Cricket | వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : కొత్త సంవత్సరంలో తొలి సిరీస్‌కు భారత్ సిద్ధమైంది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఇవాళ తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. 3 వన్డేల సిరీస్ లో భాగంగా నేడు ఈ రెండు జట్లు తొలి మ్యాచ్‌లో తలపడతాయి. ఈ కొత్త ఏడాదిని విజయంతో మొదలు పెట్టాలని టీమ్ఇండియా భావిస్తోంది. వడోదర స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ (Match) జరగనుంది. వడోదరలోని BCA స్టేడియంలో ఈ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్ కోసం స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నెట్స్‌లో ప్రాక్టీస్ చేశారు. పూర్తి ఫిట్నెస్తో రేపు బరిలోకి దిగనున్నారు. గతేడాది ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్‌ల్లో అద్భుతంగా రాణించడంతో మరోసారి అభిమానుల కళ్లన్నీ వీరిద్దరి పైనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఇద్దరూ భీకర ఫామ్‌లో ఉన్నారు. ప్రస్తతం వన్డే ర్యాకింగ్స్లో టాప్ 2 స్థానాలు ఈ ఇద్దరివే. గతఫామ్ కొనసాగిస్తూ మరోసారి ఈ సిరీస్‌లో రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Cricket | కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రాణించేనా?
కెప్టెన్ శుభ్‌మన్ గిల్ విశ్రాంతి తర్వాత బరిలోకి దిగనున్నాడు. వన్డే జట్టుకు కెప్టెన్ అయ్యాక గిల్ నుంచి పెద్ద ఇన్నింగ్స్ రాలేదు. ఈ సిరీస్‌లోనైనా గిల్ బ్యాట్‌తో రాణించాల్సి ఉంది. అటు శ్రేయస్ అయ్యర్ కూడా ఆడే ఛాన్స్ ఉంది. బ్యాటింగ్‌లో రో-కో, గిల్‌తోపాటు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాతో పటిష్ఠంగా ఉంది. ఇక ఆల్‌రౌండర్ల విభాగంలో పోటీ ఎక్కువగానే ఉంది. సీనియర్ కోటాలో జడ్డూకు స్థానం ఖాయంగానే కనిపిస్తుంది. అయితే వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) మధ్యలో పోటీ ఉంది. ఈ ఇద్దరిలో ఒకరు బరిలో దిగే ఛాన్స్ ఉంది. పేస్ బౌలింగ్‌లో సీనియర్ మహమ్మద్ సిరాజ్ నాయకత్వం వహించనున్నాడు. అతడితోపాటు అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా జట్టులో ఉండనున్నారు. వీళ్లతోపాటు స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌కు జట్టులో చోటు దక్కే ఛాన్స్ ఉంది. ఓవరాల్‌గా భారత్ బ్యాటింగ్, బౌలింగ్‌లో బలంగానే ఉంది.

Cricket | న్యూజిలాండ్ జట్టులో..
న్యూజిలాండ్ జట్టులో స్టార్ (Star) ఆటగాళ్లు ఈ సిరీస్‌కు దూరమయ్యారు. దీంతో మైఖేల్ బ్రాస్‌వెల్ నాయకత్వంలో కివీస్ ఆ సిరీస్‌లో ఆడనుంది. డేవన్ కాన్వే, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ మినహా ప్రత్యర్థి జట్టులో చెప్పుకోదగ్గ సీనియర్ ఆటగాళ్లు లేరు. దీంతో యువ ఆటగాళ్లతో కూడిన న్యూజిలాండ్ భారత్‌పై సిరీస్‌లో ఏ మేరకు రాణిస్తుందో ఆసక్తి నెలకొంది.

Cricket | మధ్యాహ్నం 1.30గంటలకు..
ఈ సిరీస్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తుంది. తొలి వన్డే వడోదర కోటంబి మైదానం వేదికగా జరగనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఒంటిగంటకు టాస్ (Toss) పడనుంది. అయితే కోటంబి స్టేడియం బ్యాటింగ్‌కు సహకరిస్తుంది. బంతి నేరుగా బ్యాట్‌పైకి వస్తుంది. దీంతో రో-కో నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశించవచ్చు! అయితే తొలుత బౌలింగ్ చేసే జట్టుకు అడ్వాంటేజ్‌గా ఉంటుంది. రాత్రి మంచు ఉండే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో టాస్ కీలకం కానుంది.

Cricket | ఇక్కడ చూడొచ్చు..
ఈ సిరీస్‌కు స్పోర్ట్స్ ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోస్టార్ అధికారిక బ్రాడ్కాస్టర్లుగా వ్యవహరిస్తున్నాయి. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌కు (Network) సంబంధించిన టెలివిజన్ ఛానెల్లో లైవ్ మ్యాచ్ ప్రసారం అవుతుంది. అలాగే జియోస్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ కూడా అందుబాటులో ఉంటుంది. అయితే జియోస్టార్‌లో ఉచితంగా మ్యాచ్ చూడడం కుదరదు. దీనికి సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, జియో తమ యూజర్లకు ఎంపిక చేసిన రీఛార్జ్ ప్లాన్స్‌పై జియోస్టార్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఇస్తుంది.

