ఒత్తిడి లేకపోతే విజయం కూడా ఉండదా..?
జీవితాన్ని మార్చేది అదృష్టం కాదు… ఒత్తిడిని ఎదుర్కొనే తీరు..!
ఒత్తిడి లేని జీవితం కావాలని అందరూ కోరుకుంటారు. కానీ ఒత్తిడి లేని జీవితం నిజంగా అభివృద్ధికి దారితీస్తుందా? ఈ ప్రశ్నకు మనోవిజ్ఞాన శాస్త్రం ఇచ్చే సమాధానం ఆశ్చర్యకరంగా ఉంటుంది. ప్రతి ఒత్తిడీ హానికరం కాదు. నిజానికి మనిషి ప్రతిభను వెలికి తీయడంలో, నైపుణ్యాలను పదును పెట్టడంలో, అసాధారణ విజయాలకు పునాది వేయడంలో కొంత ఒత్తిడి కీలక పాత్ర పోషిస్తుంది.
అందుకే మనోవిజ్ఞాన శాస్త్రంలో “యూస్ట్రెస్” అనే భావనకు ఎంతో ప్రాధాన్యం ఉంది. దీనిని సానుకూల ఒత్తిడి అని కూడా అనవచ్చు. మనిషిని కుంగదీయకుండా ముందుకు నడిపించే శక్తి. దీనికి భిన్నంగా, “డిస్ట్రెస్” అనే ప్రతికూల ఒత్తిడి వ్యక్తిని శారీరకంగా, మానసికంగా దెబ్బతీస్తుంది.
ఒక విద్యార్థి పరీక్షకు ముందు, ఒక వైద్యుడు క్లిష్టమైన శస్త్రచికిత్సకు ముందు, ఒక క్రీడాకారుడు ఫైనల్ మ్యాచ్‌కు ముందు, ఒక నాయకుడు కీలక ప్రసంగానికి ముందు కొంత ఒత్తిడిని అనుభవిస్తారు. అదే వారిని మరింత అప్రమత్తంగా, ఏకాగ్రతతో పనిచేసేలా చేస్తుంది. కొద్దిపాటి ఒత్తిడి లేకపోతే నిర్లక్ష్యం పెరుగుతుంది; అధిక ఒత్తిడి ఉంటే సామర్థ్యం తగ్గిపోతుంది. అందుకే విజయానికి అవసరమయ్యేది ఒత్తిడి లేకపోవడం కాదు, ఒత్తిడిని సక్రమంగా వినియోగించుకోవడం.
పురాణాలు కూడా ఇదే సందేశాన్ని ఇస్తాయి. కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడు మానసికంగా కుంగిపోయాడు. బంధువులపై ఆయుధం ఎత్తలేనని యుద్ధాన్ని వదిలేయాలనుకున్నాడు. అదే సమయంలో శ్రీకృష్ణుడు భగవద్గీత ద్వారా అతనిలోని సందేహాన్ని తొలగించి కర్తవ్యబోధ చేశాడు. పరిస్థితులు మారలేదు. మారింది అర్జునుడి ఆలోచనా విధానం. ఆ మార్పే అతన్ని మహా విజేతగా నిలబెట్టింది.
రామాయణంలో హనుమంతుడి కథ కూడా ఇదే సత్యాన్ని చెబుతుంది. సముద్రం దాటే ముందు తన శక్తిని తానే మర్చిపోయిన హనుమంతుడికి జాంబవంతుడు అతని సామర్థ్యాన్ని గుర్తు చేశాడు. ఆత్మవిశ్వాసం మేల్కొన్న వెంటనే అసాధ్యంగా కనిపించిన కార్యం సులభమైంది. ఒత్తిడిని అవకాశంగా మార్చేది బాహ్య పరిస్థితులు కాదు, అంతర్గత విశ్వాసం.
ఆధునిక ప్రపంచంలోనూ ఇదే కనిపిస్తుంది. డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం ప్రారంభ వైఫల్యాల ఒత్తిడిని నిరాశగా కాకుండా అనుభవంగా మలుచుకున్నారు. సచిన్ టెండూల్కర్ కోట్లాది అభిమానుల అంచనాల ఒత్తిడిని బాధ్యతగా స్వీకరించాడు. పి.వి. సింధు ప్రపంచ వేదికపై ఒత్తిడిని ఆత్మవిశ్వాసంగా మార్చుకుని ఒలింపిక్ పతకాలు సాధించింది. విజేతలందరిలో కనిపించే ఉమ్మడి లక్షణం ఒత్తిడి లేకపోవడం కాదు; ఒత్తిడిని శక్తిగా మలచుకోవడం.
ఒకే పరిస్థితిలో ఇద్దరు వ్యక్తులు ఎందుకు భిన్నంగా స్పందిస్తారు? కారణం పరిస్థితి కాదు; దానిని అర్థం చేసుకునే విధానం. జ్ఞానం, నైపుణ్యం, అనుభవం, ఆత్మవిశ్వాసం ఉన్నవారు ప్రతి సమస్యను అవకాశంగా చూస్తారు. సిద్ధత లేనివారు అదే పరిస్థితిని ప్రమాదంగా భావిస్తారు. అందుకే సమర్థుడికి ఒత్తిడి ఒక మెట్టు; అసమర్థుడికి అదే ఒత్తిడి ఒక అడ్డు గోడ.
దీర్ఘకాలం కొనసాగే ప్రతికూల ఒత్తిడి మాత్రం ప్రమాదకరం. అది నిద్రలేమి, అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు, ఆందోళన రుగ్మతలు, డిప్రెషన్ వంటి అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి ఒత్తిడిని నిర్లక్ష్యం చేయడం ఎంత తప్పో, ప్రతి ఒత్తిడిని శత్రువుగా భావించడం కూడా అంతే తప్పు.
ఒత్తిడిని వరంగా మార్చుకోవాలంటే జ్ఞానాన్ని పెంచుకోవాలి. నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి. సమయపాలన అలవాటు చేసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా, ధ్యానం చేయాలి. సమతుల ఆహారం, తగినంత నిద్రకు ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా సమస్యలపై కాకుండా పరిష్కారాలపై దృష్టి పెట్టాలి. అవసరమైతే కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవడంలో ఎలాంటి సంకోచం ఉండకూడదు.
ఒత్తిడి జీవితంలో అనివార్యం. కానీ అది మన శత్రువా, మిత్రుడా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. అగ్ని ఆహారాన్ని వండుతుంది; అదే అగ్ని ఇంటిని కాల్చేస్తుంది. తప్పు అగ్నిలో లేదు. దానిని ఉపయోగించే విధానంలో ఉంది. ఒత్తిడికీ ఇదే సూత్రం వర్తిస్తుంది.
అందుకే జీవితంలో ఒత్తిడిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. దాన్ని అర్థం చేసుకోవాలి, నియంత్రించుకోవాలి, విజయానికి ఇంధనంగా మార్చుకోవాలి. సమర్థులకు ఒత్తిడే వరం. అసమర్థులకు ఒత్తిడే శాపం.
– డాక్టర్ ఎన్. బి. సుధాకర్ రెడ్డి
కౌన్సెలింగ్ సైకాలజిస్టు
