ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అర్హుల పరిశీలన..

గుడిసెల్లో నివసించే వారికే తొలి ప్రాధాన్యం

తొర్రూర్ రూరల్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో గుడిసెలు లేని గ్రామాలే ప్రభుత్వ లక్ష్యమని, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిజమైన నిరుపేదలకు శాశ్వత గృహాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఎంపీఓ హరిఫ్ తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియలో భాగంగా శనివారం అధికారులు అమర్‌సింగ్ తండాలో పర్యటించి అర్హుల వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గుడిసెల్లో నివసిస్తూ సొంత పక్కా ఇల్లు లేని కుటుంబాలను గుర్తించి వారి వివరాలను నమోదు చేశారు.

ఈ సందర్భంగా ఎంపీఓ హరిఫ్ మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం అర్హులైన లబ్ధిదారులనే ఎంపిక చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా గుడిసెల్లో నివసిస్తున్న కుటుంబాలకు తొలి ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు.

ప్రజలు సరైన సమాచారం అందించి అధికారులకు సహకరించాలని, అర్హులందరికీ పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ నవీన్, పంచాయతీ కార్యదర్శి రమాదేవి, హౌసింగ్ ఏఈ హిమబిందు, గ్రామ సిబ్బంది పాల్గొన్నారు.