20లోగా ఓటర్ల సవరణ పూర్తి చేయాలి

వంద శాతం నమోదు లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలి
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి: ఈ నెల 20వ తేదీలోగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పూర్తిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని ఘన్‌పూర్ మండల కేంద్రంలో జరుగుతున్న ఓటర్ల నమోదు ప్రక్రియను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి పురోగతిని సమీక్షించారు.

ఈ సందర్భంగా 306వ పోలింగ్ కేంద్రం పరిధిలో బీఎల్‌ఓ గీత నిర్వహిస్తున్న ఓటరు నమోదు కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్, రోజువారీ నమోదు వివరాలు, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై ఆరా తీశారు. మిగిలిన నమోదు ప్రక్రియను వచ్చే ఐదు రోజుల్లో పూర్తిచేయాలని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం రూపొందించిన యాప్ ద్వారా ఓటరు నమోదు ప్రక్రియను సులభంగా పూర్తిచేసుకోవచ్చని తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారాలు నింపడంలో ఎలాంటి సందేహాలు ఉన్నా సంబంధిత బీఎల్‌ఓల సహాయం తీసుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితాలో పారదర్శకత కోసం మరణించిన వారు, వలస వెళ్లిన వారి పేర్లను నిబంధనల మేరకు తొలగిస్తామని చెప్పారు.

18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడమే ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ పేర్కొన్నారు. ఓటర్ల జాబితా సవరణ అత్యంత బాధ్యతాయుతమైన ప్రక్రియ అని, గడువులోగా వంద శాతం పూర్తి చేసేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, పశుసంవర్ధక శాఖ ఉపసంచాలకుడు డా. కుమారస్వామి, వ్యవసాయ అధికారి బాబూరావు, తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎంపీడీఓ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.