స్వచ్ఛతలో ప్రజల భాగస్వామ్యంతోనే స్వర్ణాంధ్ర సాధ్యం: సీఎం చంద్రబాబు
- గుడివాడలో 18వ స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం..
- రూ.15,274 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి మూడో శనివారం స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో పాల్గొంటున్నానన్నారు. 18వ స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని గుడివాడలో నిర్వహిస్తున్నామని, ఎన్టీఆర్ తొలిసారి ప్రజాక్షేత్రంలో నిలబడిన ప్రాంతం ఇది అన్నారు. స్వచ్ఛమైన రాజకీయాలు, స్వచ్చమైన ప్రజాప్రతినిధులు, స్వాభిమానం అనే అంశాలపై ఎన్టీఆర్ పార్టీ పెట్టారన్నారు. గతంలో స్వార్ధ రాజకీయాలు మాత్రమే ఉన్న పరిస్థితిని మార్చి అభివృద్ధి, సంక్షేమాన్ని తీసుకువచ్చారని, అర్హులందరికీ సంక్షేమం, రాష్ట్రంలో అభివృద్ధి, ఉపాధి ఉద్యోగాలు, సంపద వచ్చేలా పాలన అందిస్తున్నామన్నారు.
రోడ్లు ఊడ్చటం ఒక్కటే పరిశుభ్రత కాదు, పర్యావరణం, ప్రజల ఆరోగ్యం మెరుగ్గా ఉండాలని, గత పాలనలో చెత్తాచెదారం నింపేసిన ఈ ప్రాంతాన్ని ఇప్పుడు పరిశుభ్రంగా తీర్చిదిద్దామన్నారు. మన జన్మ స్థలాన్ని చెత్తలేకుండా పరిశుభ్రంగా ఉంచాలన్న ఆలోచనతో మనం పనిచేయాలన్నారు. ప్రభుత్వానికి ప్రజలు సహకరిస్తేనే స్వచ్ఛతా లక్ష్యం సాధ్యం అవుతుందన్నారు. పచ్చదనం, పరిశుభ్రత ఉంటేనే మన లక్ష్యాన్ని సాధించగలమని, శాంతిభద్రతలు, సంక్షేమం, ఆదాయంతో మెరుగైన జీవన ప్రమాణాలు ప్రజలకు ఉండాలన్నదే మా లక్ష్యమన్నారు.
తెలుగు జాతి భవిష్యత్తును రక్షించే బాధ్యత నేను తీసుకున్నానన్నారు. పూర్తి పారదర్శకంగా సుపరిపాలన అందిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతి సహించబోమని, మన ప్రజా రాజధాని అమరావతిని కాపాడుకునేలా ప్రతీ ఒక్కరూ స్పూర్తిగా పనిచేయాలని, గతంలో జన్మభూమి పిలుపు ఇచ్చినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వచ్చి పనిచేశారు. ఇదే స్పూర్తి కొనసాగాలన్నారు. 120 పట్టణ ప్రాంత స్థానిక సంస్థల కింద రూ.15,274 కోట్లతో వివిధ పనులకు శంకుస్థాపనలు చేశామన్నారు. ప్రజారోగ్య మున్సిపల్ ఇంజనీరింగ్ కింద ఈ పనులు చేపడుతున్నామన్నారు.
మురుగునీటి శుద్ధికి సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్లు, మంచినీటికి ఓవర్ హెడ్ ట్యాంకులు, చెరువులు పునరుద్ధరణ, డ్రైనేజి లాంటి పనుల కోసం వీటిని చేపడుతున్నామన్నారు. సురక్షితమైన తాగునీరు, మెరుగైన పారిశుధ్ద్య వ్యవస్థ తీసుకురావాలన్నదే మా ఆలోచన అన్నారు. ఇంటింటికీ చెత్త సేకరణ కోసం 126 ఎలక్ట్రిక్ ఆటోలను ప్రారంభించుకున్నామన్నారు. త్వరలో 1104 ఇ-ఆటోలు కూడా అందుబాటులోకి వస్తాయని, 528 కోట్లతో వ్యర్ధాల నిర్వహణ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. అలాగే చెత్త నుంచి విద్యుత్ తయారు చేసేలా రాష్ట్రంలో 8 ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ప్రతీ ఇంటిలోనూ వ్యర్ధాల వర్గీకరణ మొదలు పెట్టాలని ప్రజలను కోరుతున్నానన్నారు. స్వచ్ఛ రథం పేరిట వ్యర్ధాలను సేకరిస్తూ రూ.16కోట్లను ఖర్చు చేసి నిత్యావసర సరుకులు ఇచ్చామన్నారు. గత పాలకులు చెత్తను రోడ్లపై గుట్టలు గుట్టలుగా పేర్చి వదిలేశారన్నారు. ఈ కారణంగా భూగర్భజలాలు కాలుష్యం బారినపడ్డాయన్నారు. గత పాలకులు వదిలేసిన 140 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించామని, అక్టోబరు 2 తేదీనాటికి చెత్త రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దుదామన్నారు. స్వచ్ఛ పథం కార్యక్రమం ద్వారా రహదారులు, పరిసరాలను శుభ్రం చేస్తున్నామని, ఆపరేషన్ క్లీన్ స్వీప్ ద్వారా స్వచ్ఛమైన పట్టణ ప్రాంతాలు, ప్రజల భాగస్వామ్యం కోసం కార్యక్రమం చేపట్టామన్నారు.
