Skyroot Vikram-1 | విక్రమ్-1 విజయం: సీఎం రేవంత్
Skyroot Vikram-1 | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌కు చెందిన అంతరిక్ష సాంకేతిక సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన ‘విక్రమ్-1’ ఆర్బిటల్ క్లాస్ లాంచ్ వెహికల్ టెస్ట్ ఫ్లైట్-1 (మిషన్ ఆగమన్) విజయవంతం కావడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘనతపై స్కైరూట్ ఏరోస్పేస్ బృందానికి ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన విక్రమ్-1 పరీక్షా ప్రయోగం భారత అంతరిక్ష రంగంలో కీలక మైలురాయిగా నిలిచిందని సీఎం పేర్కొన్నారు. దేశ సాంకేతిక సామర్థ్యం, ఆవిష్కరణల స్ఫూర్తికి ఇది నిదర్శనమని కొనియాడారు.
స్కైరూట్ ఏరోస్పేస్‌ను గతంలో సందర్శించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో విక్రమ్-1 ఫ్లైట్ హార్డ్‌వేర్‌ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌కు తరలించే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ప్రస్తుతం మిషన్ ఆగమన్ విజయవంతం కావడం తెలంగాణ అంతరిక్ష ప్రయాణంలో కీలక ఘట్టమని అన్నారు.
అంతరిక్ష పరిశోధనలు, ఏరోస్పేస్ టెక్నాలజీ, అధునాతన తయారీ రంగాల్లో తెలంగాణను ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంలో ఇలాంటి విజయాలు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
స్కైరూట్ ఏరోస్పేస్ విజయం తెలంగాణను దేశంలోనే ఏరోస్పేస్ ఆవిష్కరణలకు ప్రధాన గమ్యస్థానంగా నిలబెడుతోందని, యువతలో కొత్త ఆలోచనలు, స్టార్టప్‌లకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.
