భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ

  • 56.1 అడుగులకు చేరిన నీటిమట్టం
  • 16 లక్షల క్యూసెక్కులకు పైగా దిగువకు విడుదల
  • పలు మార్గాల్లో రాకపోకలు నిలిపివేత

భద్రాచలం, ఆంధ్రప్రభ : ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరడంతో భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి గోదావరి నీటిమట్టం 53 అడుగులకు చేరడంతో జిల్లా కలెక్టర్ అంకిత్ మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శనివారం ఉదయం 11 గంటల నాటికి గోదావరి నీటిమట్టం 56.1 అడుగులకు చేరగా, దిగువకు 16 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీటిని విడుదల చేస్తున్నారు.

వరద ప్రభావంతో భద్రాచలం–చర్ల మార్గంతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే పలు రహదారులు మూసివేయబడ్డాయి. భద్రాచలం–చర్ల రహదారిపై పలుచోట్ల వరద నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గురువారం నుంచి శుక్రవారం రాత్రి వరకు గోదావరి నీటిమట్టం సుమారు 25 అడుగులు పెరగడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. పరిస్థితిని జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్ క్షేత్రస్థాయిలో పరిశీలించి కరకట్ట, శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ పరిసరాలను సందర్శించారు. అధికారులకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

శనివారం మధ్యాహ్నం తర్వాత వరద ఉద్ధృతి కొంత తగ్గే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే వరద కారణంగా భద్రాచలం దాదాపు అన్ని వైపులా రాకపోకలు నిలిచిపోగా, సారపాకకు వెళ్లేందుకు పాత వంతెన మాత్రమే అందుబాటులో ఉండటం స్థానికుల్లో ఆందోళనకు కారణమైంది.