విజయవాడ అభివృద్ధే లక్ష్యం…
- రైల్వే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం
- ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)
- సౌత్ కోస్టల్ రైల్వే జీఎం మాథుర్‌తో సమావేశం..
- 8 ఆర్‌ఓబీలు, అమృత్ భారత్ అభివృద్ధి, కొత్త రైలు సేవలపై వినతి
(విజయవాడ, ఆంధ్రప్రభ) : విజయవాడ నగర రైల్వే సమస్యల పరిష్కారమే మా ప్రధాన లక్ష్యం అని,ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపేలా ఎనిమిది రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణంతో పాటు విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటాం అని విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ అన్నారు. కేంద్ర రైల్వే మంత్రిని కలిసి అన్ని ప్రతిపాదనలను ఆమోదింపజేసేందుకు కృషి చేస్తాం అని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు. సౌత్ కోస్టల్ రైల్వే జనరల్ మేనేజర్ మాథుర్‌ను కలిసి విజయవాడ నగరం, పరిసర ప్రాంతాలకు సంబంధించిన పలు కీలక రైల్వే సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు ఎంపీ వివరించారు.

నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఎనిమిది రైల్వే ఓవర్ బ్రిడ్జిల (ఆర్‌ఓబీలు) నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కోరినట్లు చెప్పారు. పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల ప్రజలకు అత్యంత కీలకమైన ఎర్రకట్ట రైల్వే వంతెన పనులను ప్రాధాన్యంగా చేపట్టాలని, అలాగే గుణదల ఎల్‌సీ–8 వద్ద ఆర్‌ఓబీ నిర్మాణాన్ని అత్యవసరంగా మంజూరు చేయాలని జీఎంకు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.”విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచినా స్పందన లేక ఆలస్యం జరుగుతోంది. రాష్ట్ర ఎంపీలందరం కలిసి కేంద్ర రైల్వే మంత్రిని కలిసి విజయవాడ స్టేషన్‌ను అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద సమగ్రంగా అభివృద్ధి చేయాలని కోరుతాం” అని ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు.
అలాగే విజయవాడ–బెంగళూరు (గుత్తి మీదుగా) కొత్త రైలు సేవను ప్రారంభించాలని కేంద్ర రైల్వే మంత్రిని కోరనున్నట్లు తెలిపారు. కొండపల్లి రైల్వే స్టేషన్‌ను కూడా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేయాలని సౌత్ కోస్టల్ రైల్వే జీఎం మాథుర్‌కు విజ్ఞప్తి చేసినట్లు ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పేర్కొన్నారు.
