సనాతన ధర్మాన్ని రాజకీయ పరిహాసానికి వేదిక చేయొద్దు

  • పార్లమెంట్‌ ప్రాంగణంలో ప్రతిపక్ష ఎంపీల నిరసనపై జనసేన ఎంపీ లింగమనేని రమేశ్‌ ఆగ్రహం

అమరావతి, ఆంధ్రప్రభ : సనాతన ధర్మాన్ని రాజకీయ పరిహాసానికి వేదిక చేయవద్దని జనసేన రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్‌ కోరారు. పార్లమెంట్‌ ప్రాంగణంలో ప్రతిపక్ష ఎంపీలు సాధువుల వేషధారణతో చేసిన నిరసనను ఆయన తీవ్రంగా ఖండించారు. సనాతన ధర్మం, సాధు సంతులు, హిందూ సమాజం మనోభావాలను కించపరిచేలా ఈ ప్రదర్శన సాగిందని విమర్శించారు. పార్లమెంట్‌ ప్రజా సమస్యలపై చర్చించాల్సిన పవిత్ర వేదిక అని, దాన్ని మతపరమైన అవహేళనలకు, రాజకీయ ప్రదర్శనలకు ఉపయోగించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని రమేశ్‌ పేర్కొన్నారు.

సనాతన ధర్మాన్ని అవమానించే చర్యలను జనసేన ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని, ధర్మ పరిరక్షణకు జనసైనికులు కట్టుబడి ఉన్నారని తెలిపారు. అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో ప్రతిపక్షాలు అసహనంతో హిందూ ధర్మాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఏ అంశంపైనైనా ప్రజాస్వామ్యబద్ధంగా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే మతపరమైన అవహేళనలకు పాల్పడటం సరికాదన్నారు. పార్లమెంట్‌ ప్రాంగణంలో ఇలాంటి ప్రదర్శనలు చేసిన ఎంపీలపై లోక్‌సభ స్పీకర్‌, రాజ్యసభ ఛైర్మన్‌ కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని లింగమనేని రమేశ్‌ కోరారు.