ఆగస్టు 6 నుంచి ఎరువుల కొనుగోలుకు ఫార్మర్ ఐడీ తప్పనిసరి

ఫార్మర్స్ రిజిస్ట్రీ పూర్తి చేసిన రైతులకే ఎరువుల విక్రయాలు

ఎడపల్లి, ఆంధ్రప్రభ : రైతులకు ఎరువుల పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 6 నుంచి సెంట్రల్ ఫర్టిలైజర్ యాప్‌ను అమల్లోకి తీసుకురానున్నట్లు వ్యవసాయ శాఖ అధికారి సిద్దిరామేశ్వర్ తెలిపారు.

ఈ యాప్ ద్వారా యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ తదితర ఎరువుల విక్రయాలు నిర్వహించనుండగా, రైతులు తప్పనిసరిగా ఫార్మర్స్ రిజిస్ట్రీలో నమోదు చేసుకుని ఫార్మర్ ఐడీ పొందాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

ప్రస్తుతం రైతుల వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఫార్మర్స్ రిజిస్ట్రీలో పేరు నమోదు చేసుకున్న వారికి ప్రత్యేక ఫార్మర్ ఐడీ జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆ ఐడీ ఆధారంగానే ఎరువుల కొనుగోలు, పంపిణీ వివరాలు నమోదు చేయబడతాయని, దీంతో ఎరువుల వినియోగం, పంపిణీపై ఖచ్చితమైన సమాచారం ప్రభుత్వానికి అందుబాటులోకి వస్తుందని వివరించారు.

వ్యవసాయ శాఖ సూచనల మేరకు రైతులు వెంటనే ఫార్మర్స్ రిజిస్ట్రీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించారు. మండల వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) కార్యాలయాలు, మీ సేవ కేంద్రాలు, సీఎస్‌సీ కేంద్రాల్లో నమోదు సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. ఆధార్, భూ వివరాలు తదితర అవసరమైన పత్రాలతో వెళ్లి నమోదు చేసుకోవచ్చని చెప్పారు.

ఆగస్టు 6 నుంచి ఎరువుల కొనుగోలు సమయంలో రైతులు తమ ఫార్మర్ ఐడీని తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుందని తెలిపారు. ఫార్మర్స్ రిజిస్ట్రీ పూర్తి చేయని రైతులకు ఎరువుల సరఫరాలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున ముందుగానే నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు.