మంగపేట మండలంలో సీత‌క్క ప‌ర్య‌ట‌న‌

112 మందిని పునరావాస కేంద్రాలకు తరలింపు..
బాధితులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశాలు
వరద పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన

ములుగు, ఆంధ్రప్రభ: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి వరద ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వరద పరిస్థితులను సమీక్షించారు. బ్యాక్‌వాటర్ ప్రభావంతో ముంపు ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలకు కల్పిస్తున్న సహాయక చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

మంగపేట మండలంలో గోదావరి వరద ప్రవాహాన్ని పరిశీలించిన మంత్రి, అనంతరం పునరావాస కేంద్రాన్ని సందర్శించి బాధిత కుటుంబాలతో మాట్లాడారు. బ్యాక్‌వాటర్ ప్రభావంతో ముంపు ముప్పు ఉన్న ప్రాంతాలకు చెందిన 28 కుటుంబాల 112 మందిని సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించినట్లు అధికారులు మంత్రికి వివరించారు.

పునరావాస కేంద్రాల్లో బాధితులకు ఆహారం, స్వచ్ఛమైన తాగునీరు, వైద్య సేవలు, పారిశుద్ధ్య సౌకర్యాలు ఎలాంటి లోటు లేకుండా అందించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ప్రజలకు అవసరమైన అన్ని సహాయ చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సూచించారు.

ఎగువ ప్రాంతాల్లో ఇంకా భారీ వర్షాలు కురుస్తున్నందున గోదావరి వరద మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్న మంత్రి, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటిస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. అనంతరం వాజేడు వద్ద గోదావరి వరద ఉద్ధృతి తగ్గి ప్రజలు క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు నిర్వహించారు.