ఇంటింటికీ వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ..

  • పంపిణీ చేసిన ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

గన్నవరం, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. బాపులపాడు మండలం అంపాపురంలో శుక్రవారం నిర్వహించిన ‘2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ గత రెండేళ్లలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. అనంతరం గ్రామంలోని అవ్వాతాతలు, దివ్యాంగుల ఇళ్లకు స్వయంగా వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు.

ప్రతి నెల ఒకటో తేదీన లబ్ధిదారుల గడప వద్దకే పింఛన్లు అందించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు నేరుగా పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలిపారు. అంపాపురం గ్రామంలో సుమారు రూ.7.80 లక్షల పింఛన్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. గన్నవరం నియోజకవర్గంలో 40,608 మంది లబ్ధిదారులకు ప్రతి నెల రూ.17.39 కోట్లు, కృష్ణా జిల్లా వ్యాప్తంగా 2.29 లక్షల మందికి రూ.100.83 కోట్ల పింఛన్లు అందుతున్నాయని వివరించారు. గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొంటూ, జల్ జీవన్ మిషన్ కింద రూ.70 లక్షలతో వాటర్ ట్యాంక్, పైప్‌లైన్ పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

ఆర్డీఎస్ఎస్ పథకం కింద విద్యుత్ సరఫరా మెరుగుదలకు అవసరమైన పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని చెప్పారు. రూ.13 లక్షల వ్యయంతో నిర్మించిన ఎనిమిది గోకుల షెడ్లు గ్రామ పశుసంపద అభివృద్ధికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. గ్రామంలో ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీసిన ఎమ్మెల్యే, రక్త పరీక్షల నిర్వహణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామంలో 1,124 మంది జనాభా ఉండగా కేవలం 105 మందికే పరీక్షలు నిర్వహించడం సరికాదని అధికారులను ప్రశ్నించారు. ఆరోగ్య పరీక్షలను వేగవంతం చేసి ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

గత ప్రభుత్వం గ్రామీణ మౌలిక సదుపాయాలను నిర్లక్ష్యం చేసిందని విమర్శించిన ఆయన, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులను వేగవంతం చేస్తోందన్నారు. ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుందని, అది రాష్ట్ర అభివృద్ధికి కీలక మలుపు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో బాపులపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దయాల రాజేశ్వరరావు, మండల ప్రధాన కార్యదర్శి పుట్టా సురేష్, గ్రామ పార్టీ అధ్యక్షుడు సుంకర రాజా వేణుగోపాల్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి మల్ఫూరి సాయి కళ్యాణి, నాగార్జునసాగర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ కమిటీ ఉపాధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణ, సీనియర్ నాయకులు చిరుమామిళ్ల సూర్యం, దొంతు చిన్నా, అరుమళ్ల కృష్ణారెడ్డి, మువ్వా వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు బజారు వెంకటేశ్వరరావు, అన్నే శ్రీనివాసరావు, యాళ్ల శ్రీధర్, కలపాల కుమార్, ఆర్నేపల్లి సూరిబాబు, కోడె రేవంత్, మువ్వా వేణుగోపాల్, రాజబోయిన శివాజీ, గండికోట సీతయ్య, చిన్నాల లక్ష్మీనారాయణ, కొమ్మారెడ్డి రాజేష్, లంకా అజయ్, కొల్లూరు చంద్రకాంత్, కర్రా ప్రసాద్ పాల్, నక్కా ప్రసాద్, అట్లూరి శ్రీనివాసరావు, లంకా కృష్ణకిషోర్, నళినీకాంత్, కొండేటి నాగరాజు, రాజులపాటి నాగరాజు, కొల్లి చందు, నిమ్మకూరి మహేష్, సింహాచలం, కోడె చౌదరి,చాలగుల్ల సందీప్, కొమ్మినేని బాబీ, గరికపాటి వెంకటేశ్వరరావు, కంచర్ల సూర్యతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.