కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన విశేషం..

కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన విశేషం..

నాలుగున్నర కిలోల శిశువు సహజ ప్రసవం..

శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్య సాయి జిల్లాలోని కదిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అరుదైన వైద్య విశేషం చోటుచేసుకుంది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో శస్త్రచికిత్స (సిజేరియన్) అవసరమయ్యే సందర్భంలో వైద్యుల నైపుణ్యంతో సుమారు నాలుగున్నర కిలోల బరువున్న శిశువుకు సహజ ప్రసవం జరిపించడం విశేషంగా నిలిచింది. ఈ వివరాలను ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ హుస్సేన్ గురువారం మీడియాకు వెల్లడించారు. కదిరి పట్టణానికి చెందిన షేక్ షబానా అనే గర్భిణి ఈ నెల 28వ తేదీన తన మూడవ ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంది. వైద్య పరీక్షల సమయంలో గర్భంలోని శిశువు సుమారు నాలుగున్నర కిలోల బరువు ఉన్నట్లు గుర్తించారు.

సాధారణంగా ఇలాంటి భారీ బరువున్న శిశువుల ప్రసవం సమయంలో తల్లికి ప్రమాదం ఉండే అవకాశం ఉన్నందున, ఎక్కువగా సిజేరియన్ ఆపరేషన్‌కు పంపడం ఆనవాయితీగా ఉంటుంది. అయితే, కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న గైనకాలజిస్టులు డాక్టర్ రిషిత, డాక్టర్ ప్రత్యూషలు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి, స్టాఫ్ నర్సుల సహకారంతో ప్రత్యేక వైద్య పరికరాలను ఉపయోగించి షబానాకు సురక్షితంగా సహజ ప్రసవం నిర్వహించారు. ఈ ప్రక్రియలో తల్లి, శిశువు ఇద్దరూ క్షేమంగా ఉండటం వైద్యుల కృషికి నిదర్శనంగా నిలిచింది.

ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, శిశువు బరువు అధికంగా ఉండడమే కాకుండా, తల్లి షబానా శరీర నిర్మాణం కూడా సహజ ప్రసవానికి అనుకూలంగా లేకపోవడం. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో సిజేరియన్ చేయడం తప్పనిసరి అవుతుంది. అయినప్పటికీ వైద్యులు సమన్వయంతో, జాగ్రత్తగా వ్యవహరించి సహజ ప్రసవం విజయవంతం చేయడం అభినందనీయమని ఆసుపత్రి వైద్యాధికారి హుస్సేన్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ హుస్సేన్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిపుణులైన వైద్యులు, ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులపై ఆధారపడకుండా ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా పేద వర్గాల ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం ఉంచాలని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా వైద్య సిబ్బంది మరింత శ్రద్ధతో సేవలు అందిస్తారని తెలిపారు. గతంలో కూడా ఇలాంటి సంఘటన ఒకటి సమర్థవంతంగా ఎదుర్కొని విజయవంతమయ్యారు.

తాజాగా చోటు చేసుకున్నఈ సంఘటనతో కదిరి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల ప్రతిభ మరోసారి వెలుగులోకి వచ్చింది. వైద్యులు, నర్సింగ్ సిబ్బంది సమిష్టి కృషితో సాధ్యమైన ఈ విజయాన్ని స్థానికులు ప్రశంసిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.

Leave a Reply