Police Recruitment Telangana | పోలీస్ ఉద్యోగాల భర్తీ పెంచాలంటూ ధర్నా

Police Recruitment Telangana | పోలీస్ ఉద్యోగాల భర్తీ పెంచాలంటూ ధర్నా

5 వేలు కాదు 20 వేలు…
దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగుల ఆందోళన..
నియామకాలపై స్పష్టత కోరిన అభ్యర్థులు
ఏజ్ లిమిట్‌పై తక్షణ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్

Police Recruitment Telangana | ఆంధ్రప్రభ, హైదరాబాద్: పోలీస్ ఉద్యోగాల భర్తీ సంఖ్యను పెంచడంతో పాటు నియామక ప్రక్రియకు సంబంధించిన వయోపరిమితిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ అభ్యర్థులు శుక్రవారం దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయిబాబా ఆలయం సమీపంలో ధర్నాకు దిగారు. ప్రభుత్వం ప్రతిపాదించిన పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల సంఖ్యను 5 వేల నుంచి కనీసం 20 వేల వరకు పెంచాలని వారు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున పోలీస్ నియామకాలు చేపట్టారని, ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న పోస్టుల సంఖ్య నిరుద్యోగుల ఆశలకు అనుగుణంగా లేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే పోలీస్ నియామకాలకు సంబంధించి వయోపరిమితి (ఏజ్ లిమిట్) అంశంపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం ప్రకటించాలని కోరారు. గతంలో అమలులో ఉన్న కొన్ని సడలింపులను ఇప్పుడు ఎందుకు తగ్గించారో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని నిరసనకారులు ప్రశ్నించారు.

ధర్నా సందర్భంగా అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను నిలువరించే ప్రయత్నం చేయడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పోలీసులు, నిరుద్యోగ అభ్యర్థుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.

నిరుద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, నియామకాల సంఖ్య పెంపు మరియు వయోపరిమితి అంశాలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆందోళనకారులు కోరారు. ప్రాంతంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేపట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.