ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి..
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష(Koya Sri Harsha) అన్నారు. కలెక్టరేట్‌లో వైద్యారోగ్య శాఖ పనితీరుపై ఈ రోజు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అక్టోబర్ నెలలో 263 ప్రసవాలు జరిగాయని, జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెరగడం పట్ల కలెక్టర్ వైద్యులను అభినందించారు.
ప్రసవం తర్వాత కూడా బాలింత, శిశువు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ రెగ్యులర్ ఫాలో అప్ చేయాలని అన్నారు. ఆర్.బీ.ఎస్.కే బృందాలు(RBSK teams) రెగ్యులర్ గా ప్రభుత్వ స్కూల్స్ ను తనిఖీ చేస్తూ పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. ఆర్.బీ.ఎస్.కే బృందాలు సందర్శించినట్లుగా పాఠశాలలకు సర్టిఫికెట్ జారీ చేయాలని, సదరు వివరాలు ఆన్ లైన్ లో నమోదు జరిగేలా విద్యాశాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు.
బలహీనంగా, పోషక లోపాలతో ఉన్న పిల్లల కోసం రామగుండంలో ఎన్.ఆర్.సీ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాలని, స్టాఫ్ నియామకం కొరకు నిధులు మంజూరు చేయాల్సిందిగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. జిల్లాలో పాజిటివ్(positive)గా తేలిన టిబి వ్యాధిగ్రస్తులకు న్యూట్రిషన్ కిట్, అవసరమైన చికిత్స, ప్రభుత్వ సహాయం అందేలా చూడాలన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ టీబీ వ్యాధి లక్షణాలు గల వారిని గుర్తించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
గ్రామాలలో టీబీ వ్యాధిగ్రస్తులు లేని పక్షంలో టిబి రహిత గ్రామాలను ప్రకటించాలని తెలిపారు. జిల్లాలో స్పెషలిస్ట్ డాక్టర్ల(specialist doctors) నియామకం చర్యలు చేపట్టామని, ఎవరైనా వైద్యులు అందుబాటులో ఉంటే తన దృష్టికి తీసుకొని రావాలని నేరుగా నియమించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఆర్థోపేడిక్, జనరల్ సర్జరీ, కంటి శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని, వీటిని ప్రజలు పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో నిబంధనల మేరకు పారిశుధ్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు.
కాంట్రాక్ట్ ఏజేన్సీ(Contract agency)పై ప్రత్యేక శ్రద్ధ పెడుతూ నిర్దిష్ట సంఖ్యలో పారిశుధ్య కార్మికులు విధులకు హాజరయ్యేలా చూడాలని, ఆసుపత్రి పరిసరాలు, ప్రాంగణం రెగ్యులర్ గా క్లీన్ చేసుకోవాలని అన్నారు. రామగుండంకు కేంద్రీకృత డ్రగ్ స్టోర్ తరలింపుకు చర్యలు తీసుకోవాలని, అనువైన స్థలాన్ని ఎంపిక చేసి అందించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఎన్.సీ.డే సర్వే ద్వారా జిల్లాలో గుర్తించిన బిపి, మధు మేహాం వ్యాధిగ్రస్తులకు జీవన విధానంలో చేసుకోవాల్సిన మార్పులపై ఏ.ఎన్.ఎం, ఆశా కార్యకర్తల ద్వారా అవగాహన కల్పిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
ఎన్.సీ.డీ ద్వారా గుర్తించిన మధుమేహం(Diabetes) అధిక స్థాయి ఉన్న రోగుల్లో అవసరమైన వారికి కంటి పరీక్షలు నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆరోగ్యశాఖ పరిధిలో మంజూరైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సబ్ సెంటర్ భవన నిర్మాణ పనులు సంబంధిత ఇంజనీరింగ్ అధికారుల(engineering officers)తో సమన్వయం చేసుకుంటూ త్వరగా ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రోగులకు డయాగ్నొస్టిక్ హబ్ ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించి ఫలితాలు అందించడంలో పెద్దపల్లి జిల్లా ముందుందని అన్నారు. డయాగ్నొస్టిక్ హబ్(diagnostic hub) ద్వారా ప్రస్తుతం 4 గంటల 7 నిమిషాల వ్యవధిలో ఫలితాలు అందిస్తున్నామని, దీనిని మరింత తగ్గించేందుకు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వాణిశ్రీ, జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీదర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

