ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రతి ఇంటికీ చేర్చాలి: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

  • ప్రజావేదికలో టీడీపీ క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జ్‌ల విస్తృత స్థాయి సమావేశం
  • డోర్ టూ డోర్ సర్వేపై సమీక్ష.. ఉత్తమ పనితీరు కనబరిచిన వారికి ఎమ్మెల్యే అభినందనలు

గుడివాడ, ఆంధ్రప్రభ: ప్రజలకు, రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గుడివాడ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సహకారాన్ని ప్రజలకు వివరించాలని పార్టీ నాయకత్వానికి సూచించారు.

గుడివాడ పట్టణం ఏలూరు రోడ్డులోని టీడీపీ కార్యాలయం (ప్రజావేదిక)లో సోమవారం ఉదయం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అధ్యక్షతన నియోజకవర్గ పరిధిలోని టీడీపీ ముఖ్య నాయకులు, క్లస్టర్, కో-క్లస్టర్, యూనిట్, కో-యూనిట్, బూత్, కో-బూత్ ఇంచార్జ్‌లతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.

సమావేశంలో క్లస్టర్ల వారీగా నిర్వహించిన టీడీపీ డోర్ టూ డోర్ కార్యక్రమం సర్వే నివేదికలను ఎమ్మెల్యే రాము నాయకులకు చదివి వినిపించారు. అత్యధిక శాతం సర్వే పూర్తి చేసిన క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జ్‌లను ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి ఒక్కరూ సర్వే కార్యక్రమాన్ని అత్యంత బాధ్యతగా తీసుకుని మరింత వేగంగా పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారంపై చర్చించారు.

సమావేశం జరుగుతున్నంతసేపు ఎమ్మెల్యే రాము తన చమత్కారపు వ్యాఖ్యలతో పార్టీ నాయకులను ఉత్సాహపరిచారు. దీంతో సమావేశ మందిరం నవ్వులతో మార్మోగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని, జిల్లాలో గుడివాడ నియోజకవర్గాన్ని ప్రథమ స్థానంలో నిలిపేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అవసరమైతే ఆసక్తి చూపని వారి స్థానంలో ఉత్సాహం, అంకితభావం ఉన్న కొత్త వారికి అవకాశం కల్పించాలని స్పష్టం చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ప్రజల సంక్షేమం కోసం చేస్తున్న కృషిని, గుడివాడ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సహకారాన్ని ప్రతి ఇంటికీ చేరవేయాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు. ఇది ఎంతో మంచి తరుణమని, ఇలాంటి సమయంలోనే ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వం చేసిన మంచి పనులను వివరించాలని పిలుపునిచ్చారు.

కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే రాము భరోసా ఇచ్చారు. రాష్ట్రానికి అనేక ప్రాజెక్టులు, పరిశ్రమలు వస్తున్నాయని, రానున్న రోజుల్లో రాష్ట్ర ఆదాయం పెరిగి ప్రజలకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

గుడివాడలో నెలకొన్న ఐక్యతను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా మెచ్చుకున్నారని, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్త సహకారంతోనే అది సాధ్యమైందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇదే ఐక్యతను కొనసాగిస్తూ ముఖ్యమంత్రి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని పార్టీ నాయకత్వానికి సూచించారు.

“నా ఒక్కడి వల్ల ఏదీ సాధ్యం కాదు. మనమంతా కలిసికట్టుగా పనిచేస్తే ఏదైనా సాధించగలం. నేను చేస్తున్న ప్రయత్నాలను నమ్మినందుకే అందరూ నన్ను అభిమానిస్తున్నారు” అని ఎమ్మెల్యే రాము అన్నారు.

కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యత ఇస్తానని, పనిగట్టుకుని కొందరు చేసే విమర్శలను పట్టించుకోవద్దని సూచించారు. గ్రామస్థాయి నేతలను కూడా కలుపుకుని ముందుకు సాగాలని, నాయకుల మధ్య చిన్నచిన్న సమస్యలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని చెప్పారు. గుడివాడలో ఉన్న ఐక్యతను రాష్ట్ర నాయకత్వానికి మరింత బలంగా చాటిచెబుదామని పిలుపునిస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.

ఈ సమావేశంలో ఏపీ స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, గుడివాడ, రూరల్, నందివాడ, గుడ్లవల్లేరు మండలాల టీడీపీ అధ్యక్షులు పండ్రాజు సాంబశివరావు, వాసే మురళి, దానేటి సన్యాసిరావు, పోలవరపు వెంకట్రావు, అలాగే టీడీపీ క్లస్టర్, కో-క్లస్టర్, యూనిట్, కో-యూనిట్, బూత్, కో-బూత్ ఇంచార్జ్‌లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.