Sports | మహిళా ఉద్యోగుల్లో నూతనోత్సాహం..

Sports | మహిళా ఉద్యోగుల్లో నూతనోత్సాహం..
ఉత్సాహంగా రెండో రోజు ఎన్‌జీజీవో మహిళా ఉద్యోగుల క్రీడా పోటీలు..
డీఎంఆర్ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ పోటీలకు విశేష స్పందన..
ఏపీ ఎన్‌జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్
Sports | విజయవాడ, ఆంధ్రప్రభ : మహిళా ఉద్యోగుల్లో క్రీడా చైతన్యాన్ని పెంపొందించి, శారీరక-మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు విధుల్లో మరింత ఉత్సాహంగా సేవలందించేలా చేయాలనే ఉద్దేశంతో ఏపీ ఎన్‌జీజీవో మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళా క్రీడా పోటీలకు ఉద్యోగుల నుంచి విశేష స్పందన లభిస్తున్నట్లు ఏపీ ఎన్‌జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా ఏపీ ఎన్‌జీజీవో అసోసియేషన్ మహిళా ఉద్యోగుల విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలు రెండో రోజు కూడా ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి.
గురువారం విజయవాడలోని దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియంలో షటిల్ బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన మహిళా ఉద్యోగులు పెద్దసంఖ్యలో పాల్గొని పోటీలను ఉత్సాహంగా ఆడారు. పోటీలు ఉత్కంఠభరితంగా సాగి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అదేవిధంగా గాంధీనగర్‌లోని ఎన్‌జీవో హోమ్‌లో క్యారమ్స్, వ్యాసరచన, వన్ మినిట్ మెమరీ గేమ్‌లను నిర్వహించారు. ఈ పోటీల్లో మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఉద్యోగుల మధ్య స్నేహభావం, ఐక్యత, క్రీడాస్ఫూర్తి ఈ పోటీల్లో స్పష్టంగా కనిపించాయి.

ఈ సందర్భంగా ఎ.విద్యాసాగర్ మాట్లాడుతూ మహిళా ఉద్యోగులు విధుల్లో ఎదుర్కొనే ఒత్తిడిని తగ్గించుకోవడంలో క్రీడలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడమే కాకుండా మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని చెప్పారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా మహిళా ఉద్యోగులు పరస్పరం పరిచయాలు పెంపొందించుకొని ఐక్యతతో ముందుకు సాగేందుకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు.

మహిళా ఉద్యోగుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకునేలా చేయడం కోసం ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం సందర్భంగా ఇటువంటి క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు విద్యాసాగర్ తెలిపారు. ఏపీ ఎన్‌జీజీవో మహిళా విభాగం రాష్ట్ర ఛైర్‌పర్సన్ నిర్మలకుమారి మాట్లాడుతూ షటిల్ బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో 10 బ్యాచులు, డబుల్స్‌లో 15 బ్యాచులు పాల్గొన్నట్లు తెలిపారు. అదేవిధంగా వ్యాసరచన పోటీలో 60 మంది, క్యారమ్స్‌లో 70 మంది, వన్ మినిట్ మెమరీ గేమ్‌లో 150 మందికిపైగా మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నట్లు తెలిపారు.

మహిళా విభాగం కన్వీనర్ పి.మాధవి మాట్లాడుతూ ఈ క్రీడాపోటీలను రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నిర్వహిస్తున్నామని.. మహిళా ఉద్యోగుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని తెలిపారు. క్రీడల్లో విజయం సాధించిన విజేతలకు 9వ తేదీన నిర్వహించనున్న మహిళా దినోత్సవ వేడుకల్లో అతిథుల చేతులమీదుగా బహుమతుల ప్రదానం ఉంటుందని మాధవి వివరించారు. కార్యక్రమంలో ఏపీ ఎన్‌జీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీవీ రమణ, ఎపీ ఎన్‌జీజీవో మహిళా విభాగం ప్రతినిధులు కె.శివలీల, వి.శాంతిశ్రీ, బి.జానకి, ఎం.సరస్వతి, బి.విజయశ్రీ, సీహెచ్ నాగమల్లేశ్వరి, ఎస్.దివ్య, వి.సురేఖ, పి.తులసీరత్నం తదితరులు పాల్గొన్నారు.
