కూటమి రెండేళ్ల ప్రగతి నివేదికపై ఘాటు వ్యాఖ్యలు
- ప్రజలను మోసం చేసిన ప్రభుత్వ శ్వేతపత్రం
- ఎన్నికల హామీలన్నీ గాలిలో కలిశాయి
- అభివృద్ధి పేరిట అప్పులు..
- సంక్షేమం పేరిట అన్ని కోతలే
- ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి
ఆంధ్రప్రభ, విజయవాడ: కూటమి ప్రభుత్వం విడుదల చేసిన రెండేళ్ల ప్రగతి నివేదికపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి ఘాటుగా స్పందించారు. అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేసి, ఎన్నికల హామీలను తుంగలో తొక్కిన ప్రభుత్వానికి ఈ నివేదిక నిదర్శనం అనివిమర్శించారు. విజయవాడలో బుధవారం మీడియాతో మాట్లాడిన ఆమె, ముఖ్యమంత్రి చంద్రబాబుపై అబద్ధాలను అందంగా చెప్పడంలో దిట్ట అని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన నాలుగు సూత్రాల పాలన పూర్తిగా అపహాస్యంగా మారిందన్నారు.
అభివృద్ధి బూటకమని, సంపద సృష్టి పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని, సమతుల్య అభివృద్ధి పచ్చి అబద్ధమని, సంక్షేమం పేరుతో ప్రజలకు టోకరా పెట్టారని ఆరోపించారు. విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని మరింత అగాధంలోకి నెట్టడమే రెండేళ్ల పాలన సాధించిన ఘనత అని విమర్శించారు. సూపర్ సిక్స్ హామీలు పూర్తిగా విఫలమయ్యాయని షర్మిల ఆరోపించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని ఇచ్చిన హామీ అమలు కాలేదన్నారు. నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి లేదా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి లక్షలాది నిరుద్యోగ యువతను మోసం చేశారని విమర్శించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఇస్తామని చెప్పి అమలు చేయలేదని, ‘తల్లికి వందనం’, ‘దీపం’, ‘సుఖీభవ’ వంటి పథకాల అమలులోనూ ఎన్నికల హామీలకు భిన్నంగా వ్యవహరించారని ఆరోపించారు. రైతులకు ఇచ్చిన ఆర్థిక సాయం విషయంలో కూడా కేంద్ర పథకాలతో అనుసంధానం చేసి మాట మార్చారని అన్నారు.
ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలకు వేల కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్‌లో ఉంచి, అభివృద్ధి పేరుతో ప్రచారం చేసుకోవడం విడ్డూరమని షర్మిల పేర్కొన్నారు. ఒకవైపు విద్యుత్ సబ్సిడీలు ఇస్తున్నామని చెబుతూ మరోవైపు ట్రూ-అప్ చార్జీలతో ప్రజలపై వేల కోట్ల రూపాయల భారం మోపారని విమర్శించారు. ధరల స్థిరీకరణ నిధి పేరుతో ప్రకటనలు చేసినా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించలేదని, కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చెబుతున్న ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని ఆరోపించారు.
అభివృద్ధి అజెండా పేరుతో మరో లక్షల కోట్ల అప్పులు చేయడం, అమరావతి పేరుతో ప్రచారానికే పరిమితమవడం, ఎన్నికల హామీలను అమలు చేయకుండా మాటల గారడీ చేయడమే కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనకు నిదర్శనమని షర్మిల విమర్శించారు. “బాబు షూరిటీ… భవిష్యత్‌కు గ్యారెంటీ కాదు” అని వ్యాఖ్యానిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
