49 Assistants | టీజీపీఎస్‌సీ నుంచి 3 కొత్త నోటిఫికేషన్లు విడుదల

49 Assistants | టీజీపీఎస్‌సీ నుంచి 3 కొత్త నోటిఫికేషన్లు విడుదల

49 Assistants | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్‌: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం తీపి కబురు అందించింది. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న మొత్తం 290 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం కమిషన్ ఒకేసారి మూడు వేర్వేరు నోటిఫికేషన్లను అధికారికంగా విడుదల చేసింది. ప్రతి నెల రెండు లేదా మూడు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం ప్రకటించిన మరుసటి రోజే ఈ నోటిఫికేషన్లు వెలువడటం విశేషం.

ఈ నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేయనున్న పోస్టులలో రోడ్లు, భవనాల (R&B) శాఖలోనే అత్యధిక ఖాళీలు ఉన్నాయి. ఈ శాఖలో మొత్తం 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) పోస్టులు, అలాగే 49 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటితో పాటు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో ఖాళీగా ఉన్న 19 అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం మూడో నోటిఫికేషన్‌ను జారీ చేశారు. సంబంధిత విభాగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జూన్ మొదటి వారం నుండి వేర్వేరు తేదీల్లో ప్రారంభం కానుంది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) పోస్టులకు జూన్ 6 నుండి జూలై 13 వరకు, ఎలక్ట్రికల్ పోస్టులకు జూన్ 8 నుండి జూలై 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అలాగే అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ పోస్టులకు జూన్ 10న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమై జూలై 17 వరకు కొనసాగుతుంది. అర్హులైన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు ఈ ఏడాది జూలై 1 నాటికి కనీసం 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాల వారికి గరిష్ట వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఈ నియామకాలకు సంబంధించిన రాత పరీక్షలను రాబోయే అక్టోబర్ నెలలో కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్వి ధానంలో నిర్వహించేందుకు కమిషన్ కసరత్తు చేస్తోంది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం, వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఎడిట్ కొరకు టీజీపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని అధికారులు తెలిపారు.