43 ఏళ్ల వయసులో బంగీ జంప్..
43 ఏళ్ల వయసులో బంగీ జంప్..
సాహసానికి వయసు అడ్డుకాదని నిరూపించిన అధ్యాపకుడు!
చిలకలూరిపేట, ఆంధ్రప్రభ : సాహసం చేయాలనే సంకల్పం, ఆత్మవిశ్వాసం ఉంటే వయస్సు అడ్డంకి కాదని చిలకలూరిపేటకు చెందిన మోడరన్ డిగ్రీ కళాశాల కంప్యూటర్ అధ్యాపకుడు యెంబులూరి రామకృష్ణ నిరూపించారు. 43 ఏళ్ల వయసులో ఆయన బంగీ జంప్ చేసి సాహస క్రీడలపై తనకున్న ఆసక్తిని చాటుకున్నారు.
ఇటీవల గోవాలో నిర్వహించిన జాతీయ చౌక్‌బాల్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ చౌక్‌బాల్ సంఘం చైర్మన్ చేబ్రోలు మహేష్‌తో కలిసి మేనేజర్‌గా రామకృష్ణ హాజరయ్యారు. ఆ సందర్భంగా గోవాలో నిర్వహిస్తున్న బంగీ జంప్ గురించి తెలుసుకున్న ఆయన, స్వయంగా ఆ సాహస క్రీడలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు.
దక్షిణ గోవాలోని మయా లేక్ ప్రాంతంలో బంగీ జంప్ నిర్వహిస్తున్న బృందాన్ని సంప్రదించగా, ఆయన వయస్సును దృష్టిలో ఉంచుకుని మరోసారి ఆలోచించాలని నిర్వాహకులు సూచించారు. అయితే రామకృష్ణలో ఉన్న పట్టుదల, ఆసక్తి, ఆత్మవిశ్వాసాన్ని గమనించిన వారు చివరకు అనుమతి ఇచ్చారు.
దీంతో మే 29న రామకృష్ణ విజయవంతంగా బంగీ జంప్ పూర్తి చేసి అక్కడి నిర్వాహకులను ఆశ్చర్యపరిచారు. ఈ సాహస క్రీడను విజయవంతంగా పూర్తి చేసినందుకు నిర్వాహక సంస్థ ఆయనకు ప్రత్యేక ధ్రువీకరణ పత్రాన్ని అందజేసింది.
రామకృష్ణ సాధించిన ఈ ఘనతపై మోడరన్ విద్యాసంస్థల డైరెక్టర్ చేబ్రోలు మహేష్, కళాశాల అధ్యాపక సిబ్బంది, ఈడుపల్లి నిరంజన్, పటేల్ రమేష్ తదితరులు అభినందనలు తెలిపారు.
సాహసం చేయడానికి వయస్సు అడ్డంకి కాదని, లక్ష్యసాధనకు ఆత్మవిశ్వాసమే ప్రధానమని రామకృష్ణ నిరూపించారని వారు పేర్కొన్నారు. ఆయన చేసిన బంగీ జంప్ యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందన్నారు.
