యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ కు తప్పిన ప్రమాదం..
- ఊడిపోయిన రన్నింగ్ ట్రైన్ బోగీలు
అనంతపురం జిల్లా గుత్తి రైల్వేస్టేషన్ పరిధిలో యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. కర్ణాటక నుంచి బిహార్ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. రైలు వేగంగా వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా ‘జాయింట్ కప్లింగ్’ ఊడిపోవడంతో.. ఇంజన్‌తో పాటు వెళ్తున్న రైలు నుంచి ఎస్-6, ఎస్-7 బోగీలు విడిపోయి వెనుక ఉండిపోయాయి.
బోగీలు విడిపోవడాన్ని గమనించిన లోకో పైలట్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించి, తక్షణమే ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును నిలిపివేశారు. దీంతో వందలాది మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. పైలట్ అప్రమత్తతతో ఒక పెద్ద రైలు ప్రమాదం తృటిలో తప్పినట్లయింది. సమాచారం అందుకున్న రైల్వే సాంకేతిక సిబ్బంది యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగి, ఊడిపోయిన కప్లింగ్‌కు మరమ్మతులు చేశారు. బోగీలను తిరిగి విజయవంతంగా అనుసంధానించిన అనంతరం, రైలు కొంత ఆలస్యంగా గుత్తి స్టేషన్ నుంచి తన గమ్యస్థానానికి బయలుదేరి వెళ్లింది.
