TG | మంత్రులతోనే చర్చలు కావాలని డిమాండ్

TG | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వ పిలుపు మేరకు ఆర్టీసీ జేఏసీ నాయకులు చర్చల కోసం సచివాలయానికి బయలుదేరగా, ముందుగా అత్యవసర సమావేశం నిర్వహించారు.

చర్చలకు వెళ్లే ముందు ఆర్టీసీ జేఏసీ నేతలు ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో సమావేశమై ప్రభుత్వంతో చర్చించాల్సిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. కార్మికుల ప్రధాన డిమాండ్లు, చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేలా వ్యూహం రూపొందించారు.

ఇటీవల ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతి చెందిన నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులపై కూడా జేఏసీ నాయకులు తీవ్రంగా చర్చించారు. ఈ అంశాన్ని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. భేటీ అనంతరం కీలక నేతలంతా కలిసి సచివాలయానికి తరలివెళ్లారు.

అయితే, ఐఏఎస్ అధికారుల కమిటీతో సమావేశానికి జేఏసీ నేతలు నిరాకరిస్తున్నట్లు సమాచారం. నేరుగా మంత్రులతోనే చర్చలు జరగాలని వారు పట్టుబడుతున్నారు. కార్మికుల సమస్యలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఉన్నతస్థాయిలోనే నిర్ణయం రావాలని వారు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో ప్రభుత్వం జేఏసీని చర్చలకు పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ చర్చల అనంతరం సానుకూల నిర్ణయం వెలువడి సమ్మె సమస్యకు పరిష్కారం దొరుకుతుందని కార్మికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply