tamil nadu elections| ప‌దిరోజుల్లో ఫ‌లితాలు

tamil nadu elections| ప‌దిరోజుల్లో ఫ‌లితాలు

త‌మిళ‌నాడు సీఎం ఎవ‌రో..?
తంబీల ఆశీర్వాదం ఎవ‌రికో..?
సజావుగా పోలింగ్ .. 85శాతం
234 అసెంబ్లీ స్థానాల‌కు ఎన్నిక‌లు
కొన‌సాగిన త్రిముఖ పోరు
విజ‌యంపై ఎవ‌రి ధీమా వారిది?

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : తమిళనాడులో ఎన్నికల స‌మ‌రం ముగిసింది. గ‌తంలో కంటే ఈసారి పోలింగ్ సజావుగా సాగింది. నిన్న గురువారం జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఓటేయ‌డానికి ఓట‌ర్లు కూడా ఆస‌క్తి చూపారు. పోలింగ్ బూత్‌ల వద్ద ఉదయం ఏడు గంటల నుంచే పోటెత్తారు. తమిళనాడు చరిత్రలో ఏకంగా 85 శాతం దాకా పోలింగ్ న‌మోదు కావ‌డం విశేషం. 234 అసెంబ్లీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. అయితే త‌మిళ‌నాడులో త్రిముఖ పోరు సాగింది. అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నా డీఎంకే కూటమితో పాటు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోని దళపతి విజయ్ కొత్త పార్టీ టీవీకే ఎన్నిక‌ల బ‌రిలో నిలిచాయి. ఈ మూడు పార్టీలు కొన్ని నెల‌లుగా హోరాహోరీగా ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించాయి. ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునేందుకు అహ‌ర్నిశ‌లు శ్ర‌మించాయి.

ఇక తమిళనాడు మొత్తం ఓటర్ల సంఖ్య 5.73 కోట్లుగా ఉంది. ఇందులో 2.93 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉంటే 2.83 కోట్ల మంది పురుష ఓటర్లు 7,728 మంది తృతీయ లింగ ఓటర్లు ఉన్నారు. వీరిలో 85 శాతం మంది ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ఇక ఓట‌ర్లు ఎవ‌రివైపు మొగ్గు చూపారు. ఎవ‌రిని సీఎం పీఠంపై కూర్చోపెట్ట‌బోతున్నార‌నేది ఉత్కంఠ‌ను రేపుతోంది. అయితే త‌మిళ‌నాడులో త్రిముఖ పోటీ నెల‌కొన్న నేప‌థ్యంలో విజ‌యంపై ఎవ‌రిధీమా వారు వ్య‌క్తం చేస్తున్నారు. అధికార డీఎంకే అయితే మరోసారి తమదే అధికారం అని గట్టిగా చెబుతోంది. ప్రతిపక్ష అన్నా డీఎంకే కూటమి ఈసారి సీఎం కుర్చీ త‌మ‌దే అని బ‌ల్ల గుద్ది చెబుతోంది. కొత్త పార్టీ టీవీకే అధినేత దళపతి విజయ్ కూడా విజ‌యంపై ధీమాతో ఉన్నాడు.

అధికారం ఎవ‌రిదో.. సీఎం ఎవ‌రు అవుతారో తేలాలంటే మే 4న ఫలితాలు వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Leave a Reply