Nala Jamtara Cashew Nuts Price | కిలో కాజు రూ.30కే.. ఇది నిజమేనా?
Nala Jamtara Cashew Nuts Price |కిలో కాజు రూ.30కే.. ఇది నిజమేనా?
Nala Jamtara Cashew Nuts Price | జార్ఖండ్‌లోని ‘నాలా’ గ్రామం జీడిపప్పు సిటీగా ప్రచారం
Nala Jamtara Cashew Nuts Price | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ః జీడిపప్పు కిలో రూ.30 నుంచి రూ.50కే దొరికే గ్రామం ఉందని మీకు తెలుసా? జీడిపప్పు అంటే చాలామందికి ముందుగా గుర్తుకొచ్చేది దాని అధిక ధరే. మార్కెట్లో సాధారణంగా కిలో జీడిపప్పు రూ.800 నుంచి రూ.1000 వరకు ధర పలుకుతుంటే, జార్ఖండ్‌లోని ఓ ప్రాంతంలో మాత్రం కూరగాయల ధరకు జీడిపప్పు అమ్ముతున్నారనే విషయం ఆసక్తి రేపుతోంది.
జార్ఖండ్ రాష్ట్రంలోని జామ్తారా జిల్లాకు సమీపంలో ఉన్న ‘నాలా’ ప్రాంతం ఈ ప్రత్యేకతకు నిలయంగా ప్రచారం పొందింది. ఈ ప్రాంతాన్ని కొందరు ‘జార్ఖండ్ జీడిపప్పు సిటీ’ అని కూడా పిలుస్తున్నారు. ఇక్కడ జీడిపప్పు సాగు పెద్ద ఎత్తున జరుగుతుండటంతో స్థానికులు రోడ్ల పక్కనే జీడిపప్పును విక్రయిస్తుంటారు.
అయితే ఇక్కడ రూ.30 నుంచి రూ.50కు లభించేది మార్కెట్లో దొరికే పూర్తిగా ప్రాసెస్ చేసిన ప్యాకెట్ జీడిపప్పు కాదని, స్థానికంగా లభించే ముడి లేదా ప్రాసెసింగ్‌కు ముందు దశలో ఉన్న జీడిపప్పు అని స్థానిక కథనాలు చెబుతున్నాయి. మార్కెట్ సదుపాయాలు, రవాణా అవకాశాలు పరిమితంగా ఉండటం వల్ల అక్కడి రైతులు తమ వద్దకు వచ్చే కొనుగోలుదారులకు తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తోందని తెలుస్తోంది.
అక్కడి జీడిపప్పును మధ్యవర్తులు కొనుగోలు చేసి ఇతర ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని స్థానికంగా ప్రచారం ఉంది. ఒకవైపు రైతు తన ఉత్పత్తిని చవకగా అమ్ముకోవాల్సి వస్తుంటే, మరోవైపు వినియోగదారుడు అదే వస్తువుకు భారీ ధర చెల్లించాల్సి వస్తోంది.
రైతు నుంచి వినియోగదారుడి వరకు ఉన్న మార్కెటింగ్ వ్యవస్థలోని అసమానతలకు ఇది ఒక ఉదాహరణగా నిలుస్తోంది. సరైన మార్కెట్ సౌకర్యాలు, ప్రాసెసింగ్ యూనిట్లు, రవాణా వ్యవస్థ అందుబాటులోకి వస్తే రైతులకు మంచి ధర దక్కే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
