నామినేటెడ్ పదవులు ప్రజాస్వామ్యానికి విరుద్ధం

నామినేటెడ్ పదవులు ప్రజాస్వామ్యానికి విరుద్ధం
గుగులోతు నీలా హేమ్లా నాయక్
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి, ఆంధ్రప్రభ : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ విధానాల్లో బాధ్యతలు అప్పగించాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని బి ఆర్ ఎస్ నాయకులు, హుజూర్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గుగులోతు నీలా హేమ్ల నాయక్ విమర్శించారు. గరిడేపల్లి లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికలు నిర్వహిస్తే ఓటమి తప్పదనే భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం నామినేటెడ్ పదవులు అందించేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఎన్నికల నిర్వహించకుండా పదవులను నామినేట్ చేసే విధంగా ప్రభుత్వం పని చేయడం సిగ్గుచేటు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రైతులకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని తెలిపారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ, కౌలు రైతులకు సహాయం, 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీటి సమస్యల పరిష్కారం, ఎరువుల సరఫరా వంటి విషయాల్లో ప్రభుత్వం స్పష్టత లేకుండా వివరిస్తుందని ఆరోపించారు.
రైతు భరోసా అమలు ఆలస్యం కావడంతో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. యూరియా సరఫరా లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, సాగు చేసే కాలంలో రైతులకు ఎరువులు అందించలేకపోయారని, ఎరువుల కోసం రైతులు కాళ్లు అడిగేలా తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కౌలు రైతులు, రైతు కూలీలు ప్రభుత్వ విధానాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. వ్యవసాయం చేస్తున్న రైతులు మళ్లీ విద్యుత్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితిలు రావడం దురదృష్టకరమని తెలిపారు. గత కెసిఆర్ పాలనలో రైతులకు భరోసా, సాగినీటి సౌకర్యాలు, వ్యవసాయానికి ప్రాధాన్యత ఉండేదని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రైతుల్లో నిరాశ పెరిగిందని అన్నారు. రైతాంగం అంతా మళ్లీ కెసిఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో బి ఆర్ ఎస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షులు గుగులోతు సందీప్ నాయక్, నరేందర్ నాయక్, బాలు నాయక్, నాకు నాయక్, మాజీ నీటి సంఘం డైరెక్టర్ గుగులోతు వెంకటరాం నాయక్, యా కమిటీ మాజీ చైర్మన్ కోటయ్య తదితరులు పాల్గొన్నారు.
