థాయిలాండ్ టోర్నమెంట్‌కు చందన ఎంపిక

గట్టుప్పల, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా గట్టుప్పల మండల కేంద్రానికి చెందిన యువ క్రీడాకారిణి పగిళ్ల చందన అంతర్జాతీయ స్థాయిలో కీలక అవకాశం అందుకుంది. ఈ నెల 11 నుండి 15 వరకు థాయిలాండ్ దేశంలోని బ్యాంకాక్ నగరంలో జరగనున్న ఇండో–థాయిలాండ్ అంతర్జాతీయ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌కు భారత జట్టులో చందన ఎంపికైంది.
గట్టుప్పల మండల కేంద్రానికి చెందిన పగిళ్ల రాములు కుమార్తె అయిన చందన అంతర్జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడం పట్ల మండల వ్యాప్తంగా క్రీడాభిమానులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.
అదేవిధంగా రాష్ట్ర, జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు, కోచ్ పగిళ్ల జంగయ్య మరియు క్రీడాభిమానులు చందనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ టోర్నమెంట్‌లో విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు.
