విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
- జిల్లా కలెక్టర్ కె. హైమావతి
- విద్యార్థులకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధిపై అవగాహన సదస్సు
సిద్దిపేట, ఆంధ్రప్రభ: విద్యార్థులు తమలోని అంతర్గత నైపుణ్యాలను గుర్తించి, వాటిని మెరుగుపరుచుకోవడం ద్వారా ఎంచుకున్న రంగంలో ఉపాధి పొంది ఉన్నతంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకాంక్షించారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల విద్యార్థుల కోసం నిర్వహించిన ‘నైపుణ్యాభివృద్ధి – ఉపాధి పథకాల’ శిక్షణ తరగతులకు ఆమె అధ్యక్షత వహించారు.
‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యాచరణ’లో భాగంగా యువత కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని కలెక్టర్ తెలిపారు. 10వ తరగతి తర్వాత ఏ కోర్సులు చదవాలి? త్వరగా ఉపాధి పొందాలంటే ఎలాంటి నైపుణ్యాలు ఉండాలి? అనే అంశాలపై విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించారు.
యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో జిల్లాలోని సిద్దిపేట, కుకునూరుపల్లి, దుబ్బాక ఐటీఐలలో అత్యాధునిక సాంకేతిక కేంద్రాలను (ATC) ప్రభుత్వం ప్రారంభించినట్లు తెలిపారు. అలాగే హుస్నాబాద్‌లో కొత్తగా ఐటీఐ సెంటర్ మంజూరైందని, ఇది వచ్చే విద్యాసంవత్సరం నుంచి అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు.
ఇంజనీరింగ్ విద్యార్థులకు సమానంగా, కొన్ని సందర్భాల్లో అంతకంటే మెరుగైన అవకాశాలు ఈ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా లభిస్తాయని, తక్కువ సమయంలోనే స్థిరపడొచ్చని సూచించారు. కేవలం ఇంటర్, డిగ్రీ వంటి సంప్రదాయ కోర్సులే కాకుండా, నైపుణ్య ఆధారిత కోర్సులు నేర్చుకోవడం ద్వారా పట్టణ ప్రాంతాల్లో కూడా మంచి ఉద్యోగాలు పొందవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డీఆర్ఓ నాగరాజమ్మ, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, ఇండస్ట్రీస్ జీఎం గణేష్ రామ్, డీడబ్ల్యూఓ శారద, వివిధ శాఖల అధికారులు సయ్యద్ రఫీ, హమీద్, విజయ్ భార్గవ్, ప్రిన్సిపల్ రామానుజ తదితరులు పాల్గొన్నారు.

