జర్నలిస్టుపై దాడి హేయమైన చర్య..
జర్నలిస్టుపై దాడి హేయమైన చర్య..
- నిందితులను వెంటనే అరెస్టు చేయాలి
- కలెక్టరేట్లో జర్నలిస్టుల నిరసన
- కలెక్టర్, ఎస్పీలకు వినతి
మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారదులుగా పనిచేస్తున్న జర్నలిస్టుల పై దాడులు జరపడం హేయమైన చర్య అని జర్నలిస్టు సంఘాల నేతలు పేర్కొన్నారు. మెదక్ జిల్లా నార్సింగి మండలంలో ఓ విలేకరి పై జరిగిన దాడిని ఖండిస్తూ మంగళవారం బాధితునితో కలిసి మెదక్ జిల్లా జర్నలిస్టులు కలెక్టరేట్లో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టరేట్ ఏఓ యూనిస్, జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస రావులకు వేర్వేరుగా వినతి పత్రాలను సమర్పించారు.
ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాల నేతలు మాట్లాడుతూ… నార్సింగ్ మండలంలో ప్రభుత్వ స్థలంలో అక్రమంగా ఏర్పాటు చేసిన షెడ్డులకు గ్రామ పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేసిన అంశంపై వార్త ప్రచురించిన విలేకరి రాఘవేందర్‌పై కొందరు దాడికి పాల్పడినట్లు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా రంగం నాలుగో స్థంభంగా గుర్తింపు పొందిందని, సమాజంలో జరుగుతున్న అక్రమాలు, అవినీతి, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. వృత్తిలో భాగంగా వార్త కథనాలు ప్రచురిస్తే మీడియా ప్రతినిధుల పై దాడులు జరగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటువంటి దాడులు జర్నలిస్టుల్లో భయాందోళనలు కలిగించడమే కాకుండా పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే ప్రమాదం ఉందన్నారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్రంగా విచారణ చేపట్టి, దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం జిల్లా అధ్యక్షులు శంకర్ దయాళ్ చారి, టీయూడబ్ల్యూజె (143) జిల్లా నాయకులు సురేందర్ రెడ్డి, రాజశేఖర్, తిమ్మన్నగారి శ్రీధర్, నాగరాజు శర్మ, ఫారుక్ హుస్సేన్, బొందుగుల నాగరాజు, మువ్వ నవీన్, గోపాల్ గౌడ్, కామాటి కృష్ణ, నీలం, సందీప్, శ్రీనివాస్, శ్రీనివాస్ చారి, గోవర్ధన్ రెడ్డి, లక్ష్మినారాయణ, ఖయ్యుమ్, చల్ల రాహుల్, రాఘవులు, మల్లేష్, కార్తీక్, శ్రీహరి, సంగమేష్, రహమాత్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
