దేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలి: రామ్ గోపాల్ రావు

దేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలి: రామ్ గోపాల్ రావు

హసన్‌పర్తి, ఆంధ్రప్రభ: దేశ నిర్మాణంలో యువత తమ నూతన ఆలోచనలు, అపారమైన శక్తి, సాంకేతిక పరిజ్ఞానంతో కీలక పాత్ర పోషించాలని బిట్స్ పిలానీ గ్రూప్ వైస్ ఛాన్సలర్, ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్, శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీత రామ్ గోపాల్ రావు సూచించారు.

హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండలం అనంతసాగర్ సమీపంలోని ఎస్ఆర్ యూనివర్సిటీ తన 4వ స్నాతకోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించింది. ఎస్ఆర్ యూనివర్సిటీ ఛాన్సలర్, శ్రీ రాజేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ ఎ. వరదా రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన కూచిపూడి నృత్య కళాకారిణి, పద్మశ్రీ అవార్డు గ్రహీత దీపికా రెడ్డికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు.

వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ దీపక్ గార్గ్ విశ్వవిద్యాలయ నివేదికను సమర్పించారు. విద్య, పరిశోధన, ఆవిష్కరణలు, పరిశ్రమల భాగస్వామ్యాలు, అంతర్జాతీయ సహకారాలు, భవిష్యత్ ప్రణాళికల గురించి వివరించారు. ఎస్ఆర్ యూనివర్సిటీ వరుసగా నాలుగు సంవత్సరాలుగా ఎన్‌ఐఆర్‌ఎఫ్ టాప్-100లో స్థానంలో ఉందని, అలాగే 2026 టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 801–1000 ర్యాంక్, కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజినీరింగ్ విభాగాల్లో 601–800 ర్యాంకులు సాధించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన రామ్ గోపాల్ రావు మాట్లాడుతూ పట్టభద్రులను అభినందిస్తూ జీవితాంతం నేర్చుకునే తత్వం, సృజనాత్మకత, పట్టుదల, విలువల ఆధారిత నాయకత్వాన్ని అలవరచుకోవాలని సూచించారు. తెలంగాణలోని చిన్న గ్రామం నుంచి ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్‌గా, బిట్స్ పిలానీ గ్రూప్ వైస్ ఛాన్సలర్‌గా ఎదిగిన తన ప్రయాణాన్ని వివరించారు. విజయానికి కృషి, నిజాయితీ, అంకితభావమే మూలమని పేర్కొన్నారు.

గౌరవ డాక్టరేట్ స్వీకరించిన దీపికా రెడ్డి మాట్లాడుతూ ఐదు దశాబ్దాల నృత్య ప్రస్థానంలో నేర్చుకున్న అనుభవాలను పంచుకున్నారు. అభిరుచి, పట్టుదల, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో లక్ష్యాలను సాధించవచ్చని విద్యార్థులకు సూచించారు. విద్య అనేది కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా సమాజంపై సానుకూల ప్రభావం చూపే విలువలను అందించేదని పేర్కొన్నారు.

విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, నాణ్యమైన విద్య, విలువల ఆధారిత అభ్యాసానికి విశ్వవిద్యాలయం కట్టుబడి ఉందని ఛాన్సలర్ వరదా రెడ్డి తెలిపారు. విద్యార్థుల విజయాల్లో తల్లిదండ్రుల పాత్రను ఆయన ప్రత్యేకంగా కొనియాడారు.

ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు, వెండి, కాంస్య పతకాలు, ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. సుమారు 1,500 మంది విద్యార్థులకు డిగ్రీలు అందజేశారు. అనంతరం వైస్ ఛాన్సలర్ పట్టభద్రులతో ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్లు ఎ. మధుకర్ రెడ్డి, వి. మహేష్, రిజిస్ట్రార్ పి. వెంకట రమణారావు, డీన్ ఆపరేషన్స్ అండ్ గ్రోత్ ప్రొఫెసర్ ఆర్. అర్చనా రెడ్డి, ఐక్యూఏసీ డైరెక్టర్ పి.వి. రాజశేఖర్, డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ ప్రొఫెసర్ ఎ.వి.వి. సుధాకర్, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.