అవినీతి ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమే: కాంగ్రెస్ నేతల సవాల్

అవినీతి ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమే: కాంగ్రెస్ నేతల సవాల్

కోదాడ, ఆంధ్రప్రభ: మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చేసిన అవినీతి ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, రాజకీయ అక్కసుతో చేసిన వ్యాఖ్యలేనని కోదాడ కాంగ్రెస్ పార్టీ నాయకులు రావెల కృష్ణారావు, మైలిశెట్టి భాస్కర్, రాయపూడి అనుచరులు తీవ్రంగా ఖండించారు.

కోదాడ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని జీర్ణించుకోలేకనే మాజీ ఎమ్మెల్యే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని వారు విమర్శించారు.

మాజీ ఎమ్మెల్యే తన మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉంటే బహిరంగంగా నిరూపించాలని కాంగ్రెస్ నేతలు సవాల్ విసిరారు. ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి లేదా అధికారులకు ముడుపులు అందుతున్నాయని చెప్పడం సులభమని, కానీ వాటిని ఆధారాలతో నిరూపించాలని ప్రశ్నించారు.

“ముడుపులు ఇచ్చిన అధికారి ఎవరో ప్రజల ముందుకు తీసుకురావాలి” అని వారు డిమాండ్ చేశారు. “దొంగే దొంగ అన్న చందంగా” మాజీ ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆయన హయాంలోనే అవినీతి, అక్రమ వసూళ్ల ఆరోపణలు వచ్చాయని గుర్తు చేశారు.

ప్రస్తుతం కోదాడలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగిస్తున్నారని తెలిపారు. వందల కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు.

ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని సూచించారు. అవసరమైతే బహిరంగ చర్చకు సిద్ధమని, అయితే ఆ చర్చ వాస్తవాలు, ఆధారాల ఆధారంగానే జరగాలని స్పష్టం చేశారు.

ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, అభివృద్ధిని అడ్డుకునే తప్పుడు ప్రచారాలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

Leave a Reply